డైరెక్టర్‌ కట్‌ చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు..!

Update: 2021-11-06 02:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'జై భీమ్' సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య - జ్యోతిక కలిసి నిర్మించారు. గిరిజన వర్గాలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి.. చేయని నేరానికి వారిని ఎలా బలి చేస్తారు.. నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలకు దిగుతారన్న అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఇందులో జస్టిస్ కె చంద్రుగా సూర్య.. చిన్నతల్లిగా లిజోమోల్‌ జోస్‌ - ఆమె భర్త రాజన్నగా మణికందన్ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి.

ముఖ్యంగా లిజోమోల్‌ జోస్‌ 'జై భీమ్' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక తల్లి బిడ్డగా.. గర్భవతిగా.. భర్తకు దూరమైన భార్యగా.. తనకు జరిగిన అన్యాయం పై పోరాటం చేసే మహిళగా డీ గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించింది. చిన్నతల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో అసలు లిజోమోల్‌ ఎవరు అని అందరూ నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.

లిజోమోల్‌ జోస్ తొలిసారిగా మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ తో కలిసి 'మహేశింటే ప్రతికారం' చిత్రంలో నటించింది. ఈ క్రమంలో 'రిత్విక్‌ రోషన్‌' 'హనీ బీ 2.5' 'స్ట్రీట్‌ లైట్స్‌' 'ప్రేమసూత్రం' 'వత్తకోరు కాన్ముకన్‌' వంటి తదితర మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళంలో 'శివప్పు మంజల్‌ పచ్చాయ్‌' (తెలుగులో 'ఒరేయ్‌ బామ్మర్ది') సినిమాలో సిద్ధార్థ్‌ కు జోడీగా మెప్పించింది. ఈ సినిమాలో లిజో నటనను చూసిన డైరెక్టర్ జ్ఞానవేల్‌ 'జై భీమ్‌' సినిమాలో చిన్నతల్లి పాత్రకు ఎంపిక చేసుకున్నారు.

నిజానికి లిజోమోల్‌ జోస్ ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఫోటోలను 'జై భీమ్' లో చిన్నతల్లి ని కంపేర్ చేసి చూస్తే.. ఇద్దరూ ఒకరేనా అనే ఆశ్చర్యం కలగకమానదు. 'ఒరేయ్‌ బామ్మర్ది' సినిమాలో చూసిన అమ్మాయేనా అనే అనుమానం ప్రేక్షకుడిలో కలుగుతుంది. అంతలా ఆ పాత్రలో లీనమైంది లీజో. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'జై భీమ్‌' సినిమాలో తన పాత్ర గురించి లీజో మాట్లాడుతూ.. ''చిన్నతల్లి పాత్ర నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయా. ఆమె అనుభవించిన బాధ, ఆవేదన ఇప్పటికీ నాలో ఉండిపోయాయి. గతంలో నేను పోషించిన ఏ పాత్ర కూడా నన్ను ఇంతలా ప్రభావితం చేయలేదు'' అని చెప్పింది.

''కొన్ని సీన్స్ లో నటించినప్పుడు, డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నేను గ్లిజరిన్‌ వాడకుండానే ఏడ్చేశాను. డైరెక్టర్‌ కట్‌ చెప్పినా కన్నీళ్లు ఆగలేదు. తిరిగి మామూలు స్థితికి రావడానికి నాకు చాలా సమయం పట్టేది. ఎన్నిసార్లు 'జై భీమ్' సినిమా చూసినా నాకు ఏడుపు వస్తూనే ఉంది'' అని చెబుతూ లిజోమోల్‌ జోస్ ఎమోషనల్ అయింది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా లిజోమోల్‌ కు అవార్డ్ ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఈ సక్సెస్ తో ఆమెకు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
Tags:    

Similar News