నేను పుట్టిందే నొక్కెయ్యడానికి... మధ్యలో ఆపితే తొక్కేస్తా అంటున్నాడు మెగా హీరో. లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ చెబుతున్న డైలాగ్ ఇది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో వరుణ్ తేజ్ - దిశాపటాని జంటగా నటించారు. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో తల్లి పాత్రలో రేవతి - తండ్రిగా పోసాని నటించారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ట్రైలర్ ని విడుదల చేశాడు పూరి. రెండున్నర నిమిషాలపాటు సాగే ఆ ట్రైలర్ లో పూరి మార్క్ ఎమోషన్స్ - కమర్షియల్ ఎలిమెంట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ కూడా పూర్తిగా పూరి స్టైల్లోకి మారిపోయాడు. డైలాగ్ లు చెప్పే విధానంలోనూ, పాటల్లోనూ పక్కా పూరి తరహా స్టైల్ లో కనిపిస్తున్నాడు. అలీ - బ్రహ్మానందంలతో కలిసి మంచి కామెడీ ట్రాక్ ని కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. బ్రహ్మానందం అయితే ఏకంగా హెలికాఫ్టర్ లో దిగుతూ ఓ బిజినెస్ మేగ్నెట్ లాగా కనిపిస్తున్నాడు. పోస్టర్ లలో వరుణ్ - దిశాల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిన విషయం స్పష్టంగా కనిపించింది. అయితే ట్రైలర్ లో మాత్రం ఆ తరహా సన్నివేశాలేమీ కనిపించలేదు. మొత్తంగా ట్రైలర్ చూస్తే సెంటిమెంట్ తో మేళవించిన ఓ మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ ని పూరి తెరకెక్కించాడని అర్థమవుతోంది.