టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడం పై నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు ఏకంగా ఫిల్మ్ చాంబర్ వద్ద శ్రీరెడ్డి `అర్ధనగ్న` ప్రదర్శన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, టాలీవుడ్ పై శ్రీరెడ్డి ఆరోపణలపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, శ్రీరెడ్డిపై తొలిసారిగా `మా` సభ్యులు స్పందించారు. ఫిల్మ్ చాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్నంగా ఆందోళన తెలపడంపై మా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఫిలిం చాంబర్ పై శ్రీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకునేందుకు మా అసోషియేషన్ సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరెడ్డికి `మా`సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని `మా` సభ్యులు తేల్చి చెప్పారు.
నిన్న ఫిలిం చాంబర్ దగ్గర జరిగిన ఘటనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో `మా` అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు పలువురు `మా` సభ్యులు పాల్గొన్నారు. శ్రీరెడ్డి చేసిన పని టాలీవుడ్ ను అల్లరిపాలు చేసేలా ఉందని, వివాదం చేస్తే `మా` సభ్యత్వం వస్తుందని శ్రీరెడ్డి భావించటం తప్పని `మా ` అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. తెలుగు ఇండస్ట్రీకి వేలాదిమంది వస్తుంటారని, `మా` సభ్యత్వం కోసం చాలామంది దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. ఆ దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన మీదటే వారికి కార్డు మంజూరుచేస్తామని తెలిపారు. శ్రీరెడ్డికి కూడా అప్లికేషన్ ఫాం ఇచ్చామని, కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదని తెలిపారు. అంతేకాకుండా, `మా` సభ్యులపై ఆమె ఆరోపణలు చేయడం సరికాదన్నారు. శ్రీరెడ్డి అబద్దాలు చెబుతోందని, కేవలం పబ్లిసిటీ కోసం ఆమె నాటకాలాడుతోందని ఆయన అన్నారు. శ్రీరెడ్డి అప్లికేషన్ ను తిరస్కరిస్తున్నామని, శ్రీరెడ్డి పై లీగల్ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. `మా` సభ్యులెవరు ఆమెతో కలిసి నటించరని - ఒక వేళ ఎవరైనా నటిస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తామని శివాజీరాజా అన్నారు. శివాజీరాజా అభిప్రాయంతో హీరో శ్రీకాంత్ కూడా ఏకీభవించారు. అటువంటి ఘటనలను టాలీవుడ్ లో ఇంతవరకు చూడలేదని ఆయన అన్నారు. `మా` అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం చాంబర్ మద్ధతు తెలిపింది.