'మా' బిల్డింగ్ ఏమైంది విష్ణూ..?

Update: 2022-06-04 05:33 GMT
తమిళ సినీ నటీనటుల అసోసియేషన్ (నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ తెలిపారు.

నాజర్ - కోశాధికారిగా ఉన్న హీరో కార్తీ మరియు ఉపాధ్యక్షుడు తదితరులు మొన్న గురువారం ఉదయం స్థానిక పోయెస్‌ గార్డెన్‌ లోని రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం గురించి చర్చించారు.

నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయని.. నిర్మాణంలో ఉన్న నూతన భవన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

కోలీవుడ్ సినిమా అసోసియేషన్ కొత్త బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయడం కోసం రజినీకాంత్‌ సలహాలు ఇస్తున్న నేపథ్యంలో.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) భవన నిర్మాణం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.
 
సొంత ఖర్చుతో 'మా' బిల్డింగ్ నిర్మిస్తాననే ప్రధాన హామీతో ఎన్నికల బరిలో దిగిన మంచు విష్ణు.. ప్రత్యర్థి ప్యానల్ పై భారీ మెజారిటీతో గెలుపొంది నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనే సంగతి తెలిసిందే. అయితే 'మా' ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుని ఏడు నెలల గడిచినా.. ఇప్పటి వరకు భవనం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

'మా' బిల్డింగ్ కోసం మూడు స్థలాలు చూసి పెట్టానని ఎన్నికలకు ముందు విష్ణు చెప్పారు. కానీ అవి ఎక్కడనేది వెల్లడించలేదు.. భవన నిర్మాణం దిశగా అడుగులు ముందుకు పడలేదు. దీనిపై ఎప్పుడు కార్యాచరణ రూపొందిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'మా' బిల్డింగ్ ఎప్పుడు కడతారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విష్ణు ను ప్రశ్నిస్తున్నారు. మంచు ఏ హీరో ఏ ట్వీట్ పెట్టినా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవనం సంగతేంటి? అని కామెంట్స్ పెడుతున్నారు. సినిమా రిలీజ్ గురించి పోస్ట్ చేసినా.. బర్త్ డే విషెస్ ట్వీట్ పెట్టినా మా బిల్డింగ్ ఏమైందంటూ నిలదీస్తున్నారు.

త్వరలోనే అసోసియేషన్‌ తరపున 'మా' భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తానని అప్పుడెప్పుడో మంచు విష్ణు అన్నారు. తిరుపతిలో స్టూడియో కడతానని చెప్పారు గానీ.. మూవీ ఆర్టిస్ట్స్ బిల్డింగ్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

అధ్యక్ష పదవీకాలం రెండేల్లే కాబట్టి.. వీలైనంత త్వరగా 'మా' భవన నిర్మాణం మొదలు పెడితే మంచు విష్ణు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. మరి విష్ణు ఈ విషయంలో ముందడుగు వేసి, తొందరలోనే ఏదొక ప్రకటన చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News