‘మాచర్ల నియోజకవర్గం’ ఊర మాస్ ట్రైలర్ వచ్చేసింది..!

Update: 2022-07-30 14:29 GMT
యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ''మాచర్ల నియోజకవర్గం''. ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల వచ్చిన 'మాచర్ల యాక్షన్ ధమ్కీ'కి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గుంటూరులోని బ్రోడీపేటలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌ లో థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ట్రైలర్ ను ఆవిష్కరించి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

'ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తోందిరా' అని నితిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. వినోదం మరియు యాక్షన్ సమ్మేళనంగా ఉంది. ఇందులో కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డిగా నితిన్ ఆకట్టుకున్నాడు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికలు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న విలన్ రాజప్పగా సముద్రఖని ని చూపించారు.

అయితే రాజప్ప నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించాలని నిశ్చయించుకున్న సిద్దార్థ్.. అతనితో డైరెక్ట్ వార్ ప్రకటించాడు. కథేంటనేది ట్రైలర్ లోనే చెప్పే ప్రయత్నం చేశారు. "నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్లు.. వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా" వంటి డైలాగ్డ్ అభిమానులను అలరిస్తున్నాయి.


నితిన్ పాత్ర పేరుకి కలెక్టర్ అయినప్పటికీ.. ఇన్‌ బిల్ట్ మాస్ క్యారెక్టర్ అని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేసారు. కామెడీ - యాక్షన్ - రొమాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాన్ని రెడీ చేసినట్లు అర్థం అవుతోంది.

ప్రసాద్ మూరెళ్ల అద్భుతమైన విజువల్స్ - మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ - మాస్ డైలాగ్స్ మరియు ఊర మాస్ యాక్షన్.. ఈ ట్రైలర్‌ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్లు కృతి శెట్టి - కేథరిన్ థ్రెసా లకు ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. హీరోయిన్ అంజలి 'రారా రెడ్డి' స్పెషల్ నంబర్‌ లో కనిపించింది.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి మరియు నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ మరియు మురళీ శర్మ - జయప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇటీవల కాలంలో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్.. ఈసారి కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను నమ్ముకున్నట్లు అర్థం అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 'మాచర్ల నియోజక వర్గం' సినిమాని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News