సినిమా కోసం ఇంత మార్పా?

Update: 2019-01-22 09:33 GMT
సౌత్ లో ఉన్న వెర్సటైల్ యాక్టర్స్ లో మాధవన్ కున్న స్థానం చాలా ప్రత్యేకం. సఖిలో లవర్ బాయ్ గా కనిపించినా యువలో కరుడు గట్టిన రౌడీగా భయపెట్టినా అది అతనికే చెల్లుతుంది. ఇటీవలే నాగ చైతన్య సవ్యసాచిలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాధవన్ కు అది అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఒకపక్క సినిమాలతో పాటు మరోపక్క వెబ్ సిరీస్ తో అలరిస్తున్న మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సుప్రసిద్ధ సైంటిస్ట్ నంబి నారాయణ్ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్ లో సిమ్రాన్ హీరోయిన్.

ఇప్పటికే షూటింగ్ లో కీలక భాగం పూర్తయ్యింది. తన లుక్ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాధవన్ నిజమైన నంబి పక్కన ఫోటోలు దిగి పెట్టడంతో ఎవరు ఒరిజినల్ ఎవరు మాధవన్ అని పోల్చుకోవడం కష్టమయ్యింది. అంతగా మేకప్ తో పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి అభిమానులు సైతం షాక్ తిన్నారు. అయితే ఈ సినిమాకు మాధవన్ వట్టి హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా. మొదలుపెట్టిన అనంత్ మహదేవన్ మధ్యలోనే తప్పుకోవడంతో మాధవన్ ఇప్పుడు కెప్టెన్ చైర్ లో కూర్చున్నాడు.

పాతికేళ్ల నటనానుభవం ఇతన్ని దర్శకుడిగా మార్చేసింది. 1994లో ఇస్రో నేపథ్యంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఇది రూపొందిస్తున్నారు. బోలెడంత ఎమోషన్ తో పాటు నంబి కథలో కావల్సినన్ని మలుపులు ఉంటాయట. ఇది మల్టీ లాంగ్వేజెస్ లో రూపొందుతోంది. రాకెట్రీ ది నంబిలో మాధవన్ విశ్వరూపం చూడొచ్చని ఇన్ సైడ్ టాక్. కమల్-విక్రమ్ ల తర్వాత ఆ స్థాయి మేకోవర్ కోసం కష్టపడుతున్న నటుడు మాధవనే.


Full View

Tags:    

Similar News