రాకెట్రీ చిత్రం స్పేస్ ఎక్స్ పెరిమెంట్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించనుంది. గూఢచారి కుంభకోణంలో చిక్కుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త .. ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ ఆర్.మాధవన్ టైటిల్ పాత్రలో నటించారు. ఈ చిత్రం అతనికి తొలి చిత్ర దర్శకుడిగా గుర్తింపును తేనుంది.
మహమ్మారి మూడవ వేవ్ తర్వాత థియేటర్లు పునరుద్ధరణతో నిర్మాతలు తమ చిత్రాలకు కొత్త విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. రాకెట్రీ- ది నంబి ఎఫెక్ట్ ఇప్పుడు జూలై 1న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించారు. టైటిల్ పాత్రలో నటిస్తూనే దర్శకుడి వ్యవహరిస్తున్న మాధవన్ ఈ ప్రాజెక్ట్ కోసం రచయితగా నిర్మాతగానూ మారారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కూడా కనిపిస్తారు.
సౌత్ ఇండియన్ భాషలకు సంబంధించి సూర్య జర్నలిస్టుగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ హిందీ- ఇంగ్లీష్- తమిళం- కన్నడం- తెలుగు -మలయాళం ..కలుపుకుని ఆరు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ట్రైకలర్ ఫిలింస్ - వర్గీస్ మూలన్ పిక్చర్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది.
మ్యాడీ ఆల్ రౌండర్ నైపుణ్యం
అంతరిక్ష పరిశోధన.. రాకెట్ సైన్స్ నేపథ్యంలో సినిమా అంటే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో రక్తి కట్టించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎమోషనల్ కంటెంట్ తో ఎలివేషన్ కి అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించే వీలుంటుంది. ఇది ఒక సైంటిస్ట్ బయోపిక్ కథాంశం అయితే దేశం మొత్తం ఆసక్తిగా వేచి చూసేంత ఉత్కంఠ ఉంటుంది. ఇంతకుముందు అక్షయ్ కుమార్ - విద్యాబాలన్ నటించిన మిషన్ మంగళ్ ఈ తరహా సినిమానే. అంతరిక్ష పరిశోదన నేపథ్యంలో భారతీయ మహిళల విజయాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కి విజయం సాధించింది.
అయితే ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ఒక రియల్ సైంటిస్ట్ జీవితకథతో ఆర్.మాధవన్ `రాకెట్రి` సినిమాని తెరకెక్కించారు. ఆసక్తికరంగా ఈ సినిమాకి అన్నీ తానే అయ్యి పని చేశారాయన. ఆయనే కథానాయకుడు.. రచయిత.. దర్శకుడు.. నిర్మాత. రాకెట్ట్రీ: నంబి ఎఫెక్ట్ ట్రెయిలర్ ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంతకుముందు లాంచ్ చేశారు.
ఆర్ మాధవన్ మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ గా ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని ట్రైలర్ రివీల్ చేసింది. ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఊహించని విధంగా విదేశీ గూఢచారి కుట్ర వల్ల కుంభకోణంలో చిక్కుకున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ భారతీయ శాస్త్రవేత్త.. ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ గా ఆర్ మాధవన్ నటించారు. ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ ని రగిలించిన తీరు ఆసక్తికరం.
మ్యాడీ హావభావాలు ఎమోషనల్ కంటెంట్ కి ప్రశంసలు కురిసాయి. దర్శకరచయితగానూ మాధవన్ పనితనం ట్రైలర్ లో ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా మాధవన్ మరోసారి మాస్టర్ క్లాస్ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిధి పాత్ర పోషించారు.