రాసి పెట్టి ఉంది.. శివగామి పాత్ర చేసింది!

Update: 2017-07-15 10:51 GMT
‘బాహుబలి’లో శివగామి పాత్రతో రమ్యకృష్ణ ఎంత పేరు సంపాదించిందో తెలిసిందే. కానీ ఆ పాత్రను మొదట ఆమె కోసం అనుకోలేదు. శ్రీదేవి కాదన్నాకే రమ్యకృష్ణను ఆ పాత్ర వరించింది. శ్రీదేవి శివగామి పాత్రకు నో చెప్పడం మీద చాలా పెద్ద వివాదమే నడిచింది. ఈ మధ్యే దానికి తెరపడింది. ఐతే ఈ విషయంలో అంత రాద్దాంతం అవసరం లేదని అంటోంది సీనియర్ నటి మధుబాల.

రమ్యకృష్ణకు సన్నిహితురాలైన మధుబాల.. తన స్నేహితురాలికి రాసి పెట్టి ఉంది కాబట్టే ఆ పాత్ర దక్కిందని వ్యాఖ్యానించింది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల సామర్థ్యం రమ్యకృష్ణ సొంతమని.. శివగామి పాత్రను కూడా అదే తరహాలో అద్భుతంగా పోషించిందని మధుబాల వ్యాఖ్యానించింది తన స్నేహితురాలు కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. రమ్యకృష్ణ అంత బాగా నటించిందని.. తనకు తప్ప ఇంకెవరికీ ఇలా నటించడం సాధ్యం కాదు అన్న భావన కలిగించిన ఘనత రమ్యకృష్ణదేనని ఆమె అంది.

ఒక పాత్రకు ఒకరిని అనుకుని.. తర్వాత ఇంకొకరిని ఎంచుకోవడం సినీ పరిశ్రమలో కొత్త కాదని.. అలా ఎన్నో పాత్రలు ఒకరి నుంచి ఒకరికి వెళ్లాయని మధుబాల చెప్పింది. తన తొలి సినిమా ‘పూల్ ఔర్ కాంటే’ కోసం ముందు మరో కథానాయికను అనుకున్నారని.. తర్వాత అనుకోకుండా ఆ అవకాశం తనను వరించిందని మధుబాల చెప్పింది. కాబట్టి శివగామి పాత్ర విషయంలో మార్పులపై వివాదం అనవసరమని ఆమె పేర్కొంది. రమ్యకృష్ణతో కలిసి మధుబాల ‘అల్లరి ప్రియుడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News