‘బాహుబలి-2’కి అక్కడ లైన్ క్లియర్

Update: 2017-04-15 06:45 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’ టీం సినిమాను విడుదలకు రెడీ చేసే పనుల్లో తలమునకలై ఉండగా.. వారికి లేని పోని తలనొప్పులు మొదలవుతున్నాయి. ఓవైపు ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట సత్యరాజ్ కర్ణాటకకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని తెరమీదికి తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఈ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక బాహుబలి టీం తలలు పట్టుకుంటూ ఉంటే.. తమిళనాట కొత్త వివాదం తలెత్తింది. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన వివాదంతో ఏసీఈ మీడియా అనే సంస్థ ‘బాహుబలి-2’ ఈ నెల 28 విడుదల కాకుండా స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఐతే కోర్టు ఈ సినిమా విడుదలను ఆపడానికి అంగీకరించలేదు. ఈ కేసును విచారణకు స్వీకరించింది కానీ.. స్టే విధించడానికి నిరాకరించింది. సినిమా యధావిధిగా విడుదలవుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. బాహుబలి ఎగ్జిబిషన్ రైట్స్ తీసుకున్న శరవణన్ అనే వ్యక్తి తమ దగ్గర్నుంచి గత ఏడాది జనవరిలో రూ.కోటికి పైగా రుణం తీసుకున్నాడని.. తమకు అతడి నుంచి రూ.1.18 కోట్లు రావాల్సి ఉందని.. ఆ డబ్బులు ఒప్పందం ప్రకారం తిరిగి చెల్లించలేదని అంటూ ఏసీఈ మీడియా కోర్టుకెక్కింది. పెద్ద సినిమాల విడుదలకు ముందు ఇలాంటి వివాదాలు తలెత్తడం.. నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురి కావడం తమిళనాట మామూలే. ఇంతకుముందు లింగా.. కత్తి లాంటి భారీ సినిమాలకు ఇలాంటి తలనొప్పులే ఎదురయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News