భాయ్ పై మాఫియా బెదిరింపు.. బెయిల్ క్యాన్సిల్‌?

Update: 2019-09-28 05:45 GMT
మాఫియా బెదిరింపు అంటూ కోర్టుకే ఎగ‌నామం!

స‌ల్మాన్ ఖాన్ కు రాజ‌స్థాన్ కోర్టులో రెండు రోజుల క‌ష్ట‌డీ త‌రువాత బెయిల్ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఆ బెయిల్ ని స‌వాల్ చేస్తూ జోధ్‌పూర్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది. దీంతో స‌ల్మాన్ ఎలాంటి ప‌రిస్థితుల్లో వున్నా కోర్టులో హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ అయ్యాయి. స‌ల్మాన్ కోర్టు ముందు హాజ‌రు కాక త‌ప్ప‌దని లేదంటే అత‌ని బెయిల్ ర‌ద్ద‌వుతుంద‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా స‌ల్మాన్ కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌డంతో మ‌రింత‌గా అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. అస‌లింత‌కీ ఏం జ‌రుగుతోంది? .. భాయ్ కి ముప్పు తిప్ప‌లు త‌ప్ప‌వా.. అంటే?  వివ‌రాల్లోకి వెళ్లాలి.

1998లో రాజ‌శ్రీ సంస్థ నిర్మించిన `హ‌మ్ సాత్ సాత్ హై` సినిమా చిత్రీక‌రణ స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింక‌ల్ని వెటాడి హ‌త‌మార్చిన కేసులో రాజ‌స్థాన్ కోర్టు పోలీస్ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. అయితే రెండు రోజుల క‌ష్ట‌డీ త‌రువాత స‌ల్మాన్‌కు బెయిల్ ల‌భించ‌డంతో సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే ఈ సంద‌ర్భంగా ఓ లాయ‌ర్ స‌ల్మాన్ కు ఈ కేసులో ఐదేళ్లు శిక్ష‌ప‌డేలా చేస్తాన‌ని ఛాలెంజ్ చేశాడ‌ట‌. అయితే స‌ల్మాన్ లాయ‌ర్ నిశాంత్ బోరా చాక‌చ‌క్యంగా వాదించి స‌ల్మాన్ ని ఈ రోజు కోర్టుకు హాజ‌రు కాకున్నా తెలివిగా బ‌య‌ట‌ప‌డేశాడు. అయితే అత‌ని వాద‌న‌లు విన్న జోధ్ పూర్ కోర్టు విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 19కి వాయిదా వేసింది.

త‌న క్లైంట్ కోర్టుకు రావ‌డానికి సిద్ధంగానే వున్నాడ‌ని.. అయితే అత‌నికి పంజాబ్ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ స్టూడెంట్ ఆర్గ‌నైజేష‌న్ ద్వారా ప్రాణ హాని వుంద‌ని.. ఆ కార‌ణంగానే స‌ల్మాన్ కోర్టుకు హాజ‌రు కాలేక‌పోయార‌ని స‌ల్మాన్ త‌రుపు న్యాయ‌వాది వాదించి కోర్టుకు విన్న‌వించ‌డంతో త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌ర్‌కు వాయిదా వేస్తూ ఈ ద‌ఫా అయినా సల్మాన్ ని కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని.. అత‌నికి త‌గు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా పోలీసు శాఖ‌ను జ‌డ్జి ఆదేశించారు. దీంతో స‌ల్మాన్ కృష్ణ జింక‌ల కేసు డిసెంబ‌ర్‌కు వాయిదాప‌డింది. ఈ ప‌రిణామంతో స‌ల్మాన్ నిర్మాత‌లు ఊపిరి పీల్చుకున్నారు.  అయితే విద్యార్థి సంఘాల త‌ర‌పున మాఫియా త‌ర‌హా బెదిరింపులు రావ‌డం ఇటీవ‌ల ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక బెయిల్ విష‌య‌మై కోర్టును ధిక్క‌రించారా అంటే.. భాయ్  త‌రుపు న్యాయ‌వాది మాత్రం స‌ల్మాన్ హాజ‌రు కావాల్సిన అవ‌సరం లేద‌ని తేలిక‌గా కొట్టి పారేసారు. అత‌డి పంత‌మే కోర్టులో నెగ్గింది.


Tags:    

Similar News