మూవీ రివ్యూ : మహాన్

Update: 2022-02-11 03:32 GMT
చిత్రం : 'మహాన్'

నటీనటులు: విక్రమ్-ధృవ్ విక్రమ్-సిమ్రాన్-బాబీ సింహాన్-సనంత్-ముత్తు కుమార్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: శ్రేయస్ కృష్ణ
నిర్మాత: ఎస్.ఎస్.లలిత్ కుమార్
రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్

తమిళ స్టార్ హీరో విక్రమ్.. అతడి తనయుడు ధృవ్ విక్రమ్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మహాన్’. కొవిడ్ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. టీజర్.. ట్రైలర్లతో అమితాసక్తి రేకెత్తించిన ‘మహాన్’ పూర్తి సినిమాగా ఏమేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

మద్య నిషేధానికి వ్యతిరేకంగా పుట్టిన కుటుంబంలో పుట్టిన తన కొడుక్కి గాంధీ మహాన్ (విక్రమ్) అని పేరు పెట్టుకుంటాడు అతడి తండ్రి. చిన్నతనంలో పేకాటకు అలవాటు పడ్డ అతను తండ్రి మందలింపుతో దాన్ని వదిలేసి బుద్ధిగా చదువుకుంటాడు. ఆ తర్వాత స్కూల్లో టీజర్ అయి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఐతే ఒక పద్ధతిగా సాగిపోతున్న జీవితం మీద విరక్తి పుట్టి.. భార్య-కొడుకు ఇంట్లో లేని టైంలో ఒక రోజు తనకు నచ్చినట్లుగా జీవించే ప్రయత్నం చేస్తాడు. మందు కొట్టి జల్సా చేసిన అతను.. తర్వాతి రోజు ఇంటికి తిరిగొచ్చిన భార్యకు దొరికిపోతాడు. దాని వల్ల అతడి జీవితంలో కల్లోలం రేగుతుంది. భార్యా బిడ్డ దూరమై ఒంటరివాడవుతాడు. ఈ క్రమంలో తన పాత స్నేహితుడికి అండగా నిలుస్తూ.. అతడి మద్యం వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. ఈ క్రమంలో అతడి జీవితం ఇంకెన్ని మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సామి.. పితామగన్.. అపరిచితుడు.. రెండేళ్ల వ్యవధలో ఇలాంటి మూడు సినిమాల్లో పూర్తి వైవిధ్యంగా కనిపించి.. ఆ మూడు చిత్రాలతోనూ భారీ విజయాలు ఖాతాలో వేసుకుని సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడిగా మారిన నటుడు విక్రమ్. అప్పట్లో అతడిని ఇష్టపడని ప్రేక్షకుడు లేడు. అతడిపై అంచనాలు అలా ఇలా ఉండేవి కావు. కానీ తర్వాతి దశాబ్దంన్నర కాలంలో విక్రమ్ తనపై ఉన్న అంచనాలను ఒక్కసారంటే ఒక్కసారీ అందుకోలేకపోయాడు. కొన్ని పాత్రలు కాస్త ఆసక్తి రేకెత్తించినా సినిమాలు అనుకున్నంతగా లేవు. కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా అతడి పాత్రలు తనస్థాయికి తగ్గట్లు లేవు. శంకర్ సహా విక్రమ్ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకున్న దర్శకుడే లేడు ఇన్నేళ్లలో. ఐతే ‘మహాన్’ చూస్తున్నంతసేపూ ఎట్టకేలకు మళ్లీ విక్రమ్ టాలెంట్ ఏంటో చూపించే పాత్ర పడిందని.. అతడి ప్రతిభను కార్తీక్ సుబ్బరాజ్ బాగానే వాడుకుంటున్నాడని అనిపిస్తుంది. అదే సమయంలో తండ్రికి తగ్గ తనయుడిలా ధృవ్ విక్రమ్ పెర్ఫామెన్స్ సైతం ఆకట్టుకుంటుంది. తండ్రీ కొడుకులు నువ్వా నేనా అన్నట్లు తెరమీద చెలరేగిపోతుంటే చూడటమూ అభిమానులకు కనువిందే. ఇక ‘మహాన్’ ట్రైలర్లో చూసినంత గొప్పగా అనిపిస్తుందా అంటే మాత్రం ఔనని అనలేం. దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ మెరుపులు అక్కడక్కడా ఉన్నప్పటికీ.. కొన్ని ఎపిసోడ్ల వరకు వావ్ అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం ‘మహాన్’ ఒకింత నిరాశనే మిగులుస్తుంది. కానీ విక్రమ్ చాలా ఏళ్ల నుంచి చేస్తున్న చిత్రాలతో పోలిస్తే ఇది బెటర్ అనడంలో మాత్రం సందేహం లేదు.

ఓవరాల్ గా సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే.. విక్రమ్ అభిమానులు నిరభ్యంతరంగా చూడదగ్గ చిత్రం ‘మహాన్’. ఇందులో విక్రమ్ చేసిన గాంధీ మహాన్ పాత్ర కచ్చితంగా అతడి కెరీర్లో చాలా ప్రత్యేకమైంది. విక్రమ్ నటనను ఇష్టపడేవాళ్లంతా కేవలం అతణ్ని చూస్తూ కాలక్షేపం చేసేయొచ్చు. సాధారణంగా కనిపించే గాంధీ మహాన్ పాత్రలో అసాధారణంగా కనిపించడం విక్రమ్ కే చెల్లింది. చివరి గంటలో అయితే నటుడిగా విక్రమ్ విశ్వరూపమే చూపించాడు. కేవలం తన నటనతో అతను ఈ పాత్రలో ఎన్నో వేరియేషన్లు చూపించాడు. ఓవైపు తన కొడుకు ధృవ్ చెలరేగడానికి అవకాశమిస్తూనే.. విక్రమ్ తన ప్రత్యేకతను చాటుకున్న తీరుకు ఫిదా అవ్వకుండా ఉండలేం. ఇక ధృవ్ విక్రమ్ సగం సినిమా నుంచి సీన్లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి కళ్లు తిప్పులేం. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ వావ్ అనిపిస్తుంది. ఇక తండ్రీ కొడుకుల ఫేసాఫ్ సీన్లన్నీ కూడా బాగానే పేలాయి. ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది. తనతో ఒక ఆటాడుకున్న కొడుకుని.. చివర్లో పావుగా మారి తన లక్ష్యాన్నినెరవేర్చుకునే ఎపిసోడ్లో కార్తీక్ సుబ్బరాజ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమాకు అతడి మార్కు ముగింపునిచ్చాడు.

ఐతే సినిమాలో హైలైట్ల గురించి అంతా చెప్పేసుకున్నాం కదా.. ఇక ప్రతికూలతల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇబ్బందంతా ‘మహాన్’ కథతోనే. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాడిన కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. తన జీవితం పట్ల విరక్తి పుట్టి ఒక్క రోజు తన సిద్ధాంతాలన్నీ పక్కనపెట్టి తనకు నచ్చినట్లు బతకడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అక్కడ్నుంచి అతడి జీవితమే మారిపోతుంది. ఐతే హీరో భార్య.. ఆమె కుటుంబం కోణంలో చూస్తే సహేతుకంగానే అనిపించొచ్చుకానీ.. ఈ విషయంలో ఆమె తీవ్రంగా ప్రతిస్పందించి భర్త నుంచి విడిపోయి వెళ్లిపోవడం అతిగా అనిపిస్తుంది. ఇలా తండ్రికి దూరమైన కొడుకు కక్ష కట్టి పెద్ద వాడై తిరిగొచ్చి తండ్రి సామ్రాజ్యాన్ని కూల్చి అతడి మనుషుల్ని ఏరివేసే తీరు కూడా సహేతుకంగా అనిపించదు. గాంధీ వారసత్వం.. సిద్ధాంతాలు అని చెబుతూ హద్దులు మీరిన హింసతో విశృంఖలంగా చెలరేగిపోయే అతడి తీరు అర్థం కాదు. తెరపై ఎవరైనా ప్రతీకారానికి పాల్పడుతుంటే.. వాళ్లకు జరిగిన నష్టానికి అలా చేయడం కరెక్ట్ అని ప్రేక్షకుడికి అనిపించాలి. రివెంజ్ స్టోరీలకు ఈ ఎమోషన్ అత్యంత కీలకమైంది. కానీ ‘మహాన్’లో ఈ ఎమోషన్ పండలేదు. హీరో తన కుటుంబానికి దూరమయ్యే సీన్లో కానీ.. ఆ తర్వాత హీరో కొడుకు వచ్చి తండ్రితో తలపడే సీన్లలో కానీ ఎమోషన్ మిస్ అయిపోవడం ‘మహాన్’లో ఉన్న పెద్ద మైనస్. అలాగే సినిమాకు నిడివి కూడా పెద్ద సమస్య.

తండ్రీ కొడుకులు తొలిసారి ఎదురుపడే దగ్గర్నుంచి ‘మహాన్’ ఊపందుకున్నప్పటికీ.. అంతకుముందు ప్రథమార్ధమంతా కూడా చాలా బోరింగే. కొన్ని నిమిషాల్లో చెప్పాల్సిన కథకు కార్తీక్ సుబ్బరాజ్ గంటకు పైగా సమయం తీసుకోవడం ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది. కథ ఆసక్తికరంగానే ఆరంభమై.. మొదట్లోనే మలుపు తిరిగినా.. అక్కడి నుంచి హీరో సారా సామ్రాజ్యాధినేతగా ఎదిగే వైనాన్ని అనాసక్తికరంగా తీర్చిదిద్దాడు కార్తీక్. చాలా సమయం తినేసినా కథ మాత్రం పెద్దగా మలుపు తిరగదు. ‘కొండపల్లి రాజా’ లాగా ఎదుగుదాం అని హీరో అంటాడు సినిమాలో. ఈ ట్రాక్ అంతా కూడా ఆ రోజుల నుంచి వందల సినిమాల్లో చూసిందే. కొత్తగా ఏమీ లేదు. ఇక హీరో కొడుకు రంగంలోకి దిగాక.. తండ్రీ కొడుకుల మధ్య పోరు ఎలా సాగుతుందో కూడా ఒక అంచనా వచ్చేస్తుంది. కథ పరంగా ఇందులోనూ ఎగ్జైట్మెంట్ కనిపించదు. కాకపోతే ముందే అన్నట్లు విక్రమ్-ధృవ్ పెర్ఫామెన్స్.. ఆసక్తికరంగా సాగే వారి ఫేసాఫ్ సీన్లు.. క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఇలాంటి కొన్ని హైలైట్ల కోసం ‘మహాన్’పై ఒక లుక్కేయొచ్చు. కానీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా కొంచెం ఓపికతో సినిమా చూడాల్సి ఉంటుందన్నది ముందస్తు హెచ్చరిక.

నటీనటులు:

ముందే అన్నట్లు విక్రమ్ అభిమానులు కేవలం అతడి కోసం ఈ సినిమా చూడొచ్చు. విక్రమ్ అంటే ఏంటో తెలియని ఈ తరం ప్రేక్షకులు ఈ సినిమా చూసి అతడి గొప్పదనం తెలుసుకోవచ్చు. చిన్న చిన్న సన్నివేశాల్లోనూ అతను హావభావాలను పలికించిన తీరుకు ఫిదా అయిపోతాం. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ధృవ్ విక్రమ్ స్క్రీన్ మీద అడుగు పెట్టినప్పటి నుంచి అందరి చూపునూ తన వైపు తిప్పేసుకుంటాడు. ఇంటర్వెల్ దగ్గర్నుంచే రంగంలోకి దిగినప్పటికీ అతను గట్టి ప్రభావమే చూపించాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. కాన్ఫిడెన్స్.. లుక్స్.. అన్నీ ఆకట్టుకుంటాయి. ధృవ్ కు మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. సిమ్రాన్ పర్వాలేదు. సెకండాఫ్ లో ఆమె లుక్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సత్య పాత్రలో బాబీ సింహా అదరగొట్టాడు. అలాగే ముత్తు కుమార్ కూడా బాగా చేశాడు. రాకీ పాత్రలో చేసిన సనంత్ కూడా ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో మేజర్ హైలైట్లలో ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ స్టైలిష్ టేకింగ్ ను ఎలివేట్ చేసేలా అతడి ఆర్ఆర్ కూడా చాలా స్టైలిష్ గా సాగింది. పాటలు పర్వాలేదు. వాటికిందులో పెద్దగా ప్రాధాన్యం లేదు. శ్రేయస్ కృష్ణ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం రిచ్ గా అనిపిస్తాయి. 90ల నేపథ్యాన్ని బాగా చూపించారు. ఆయా సన్నివేశాల్లో రెట్రో లుక్ తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.. పిజ్జా-జిగర్ తండ చిత్రాల స్థాయిని అందుకోలేదు. అదే సమయంలో పేట-జగమే తంత్రం సినిమాల స్థాయిలో నిరాశ పరచలేదు. దర్శకత్వ పరంగా అతడి పూర్వపు టచ్ కొన్ని చోట్ల కనిపించినా.. ఓవరాల్ గా మెప్పించే సినిమా తీయలేకపోయాడు. రచన విషయంలో కార్తీక్ నిరాశ పరిచాడు. పతాక సన్నివేశాల్లో మినహాయిస్తే ప్రేక్షకుల అంచనాలను దాటి అతను కొత్తగా చేసిందేమీ లేదు. కాకపోతే విక్రమ్.. ధృవ్ లను అతను బాగా ఉపయోగించుకున్నాడు.

చివరగా: మహాన్.. కొన్ని మెరుపుల కోసం

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News