మహేష్ కృష్ణను గుర్తుకు తెచ్చిన వేళ..

Update: 2018-04-21 12:05 GMT
సూపర్ స్టార్ కృష్ణ చాలా పెద్ద స్టార్ అయ్యాడు కానీ.. ఆ స్థాయి స్టార్ హీరోలు ఎవరిలోనూ లేని మైనస్‌ లు ఆయనలో ఉన్న మాట వాస్తవం. డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్.. డ్యాన్సుల విషయంలో కృష్ణ బలహీనతల గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎన్ని స్పూఫులు.. పేరడీలు నడిచాయో లెక్కే లేదు. ఆయన నట వారసత్వాన్ని అందుకుని హీరోగా అరంగేట్రం చేసిన మహేష్ బాబు.. తండ్రిని ఎక్కడా అనుకరించింది లేదు. కృష్ణలోని ప్లస్సుల్ని మాత్రమే పుణికిపుచ్చుకుని.. మైనస్ లను కూడా కవర్ చేస్తూ అన్ని విషయాల్లోనూ సత్తా చాటుకుని పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్నాడు మహేష్. కృష్ణ అభిమానులు మహేష్ కు ఆటోమేటిగ్గా ట్రాన్స్ ఫర్ అయిపోగా.. సొంతంగా తన చరిష్మాతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రిన్స్.

ఐతే కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నడూ కృష్ణను అనుకరించడానికి.. ఆయనలా కనిపించడానికి ప్రయత్నించని మహేష్.. తొలిసారిగా ‘భరత్ అనే నేను’లో తండ్రిని తలపించడం విశేషం. సీఎంగా ప్రమాణం చేసేటపుడు మహేష్ వాయిస్ పెంచగానే అందరికీ కృష్ణే గుర్తుకొచ్చాడు. ఇది చాలదన్నట్లుగా సీఎం పాత్రలో హీరోయిన్ని లవ్ చేసే మహేష్.. ఆమెతో తిరిగేటపుడు జనాలు గుర్తు పట్టకుండా ఉండేందుకు మీసం పెట్టుకుంటాడు. ఆ లుక్ చూస్తే అందరికీ కృష్ణను చూస్తున్నట్లే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇంకా కొన్ని చోట్ల తన బాడీ లాంగ్వేజ్ తో కృష్ణను గుర్తుకు తెచ్చాడు మహేష్. ఇన్నాళ్లూ సొంత ఐడెంటిటీతోనే సాగిన మహేష్.. ఇప్పుడు కొత్తగా తండ్రిని అనుకరించే ప్రయత్నం చేయడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం. బహుశా ఇదంతా మహేష్ ప్రయత్నం లేకుండానే కూడా జరిగిపోయి ఉండొచ్చేమో.

 
Tags:    

Similar News