నాన్న బాటలో నడవనంటున్న మహేష్

Update: 2015-07-29 12:26 GMT
నటుడిగా తన తండ్రే తనకు స్ఫూర్తి అంటుంటాడు మహేష్. నటుడిగా చాలా తక్కువ వ్యవధిలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న మహేష్.. తండ్రిని కూడా దాటేసి చాలా కాలమైందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ మధ్యే తండ్రి బాటలో నిర్మాతగానూ అవతారమెత్తి ‘శ్రీమంతుడు’ సినిమాకు సహ నిర్మాత అయ్యాడు మహేష్. ఐతే ఒక్క విషయంలో మాత్రం తాను తండ్రి బాటలో నడవనంటున్నాడు మహేష్. అదే దర్శకత్వం చేయడం. కృష్ణ దర్శకుడిగా మారి సింహాసనం, పచ్చని సంసారంలాంటి సూపర్ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఐతే తాను మాత్రం ఎప్పటికీ మెగా ఫోన్ పట్టే ఛాన్సే లేదని తేల్చేశాడు మహేష్.

‘‘దర్శకత్వం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భవిష్యత్తులోనూ ఆ  పని చేసే ఉద్దేశం లేదు. దర్శకత్వం చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. అది నాకు చేతకాదు. నటుడిగా ఉండటమే నాకు ఇష్టం’’ అని తేల్చి చెప్పాడు మహేష్. ఇతర భాషల్లో నటించే అవకాశం గురించి మాట్లాడుతూ.. తాను చిన్నపుడు చెన్నైలో పెరగడం వల్ల తనకు తమిళం బాగా వచ్చని.. ఆ భాషలో సినిమాలు చేస్తానని.. కుదిరితే ద్విభాషా చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తానని.. ఐతే బాలీవుడ్ సినిమాల్లో మాత్రం నటించే ఉద్దేశం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేశాడు మహేష్. నట కుటుంబం నుంచి రావడం వల్ల అది తనకు ప్లస్ అయిందని.. రేప్పొద్దున గౌతమ్ కూడా కూడా అది కలిసొస్తుందని మహేష్ చెప్పాడు.
Tags:    

Similar News