సూపర్ స్టార్ స్పందించక పోవటంతో నిలదీసిన ఫాన్స్!

Update: 2019-09-14 09:53 GMT
ప్ర‌పంచంలోనే గొప్ప అట‌వీ సంప‌ద‌గా చెప్పుకునే అమెజాన్ త‌గ‌ల‌బ‌డిపోతున్న దృశ్యాల్ని నాసా చిత్ర‌ప‌టాల రూపంలో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ మాన‌వాళికి 20శాతం ఆక్సిజ‌న్ ని అందిస్తున్న మ‌హా వృక్షాలు అగ్నికి ఆహుత‌వుతున్న దృశ్యాలు చూసి భీతిల్లిపోయారంతా. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సెల‌బ్రిటీలు దీనిపై స్పందించారు. ఇలాంటి విష‌యాల్లో ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే మ‌న సెల‌బ్రిటీలు ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇందులో భాగంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ - సాయిధ‌ర‌మ్ స‌హా ప‌లువురు సామాజిక మాధ్య‌మాల్లో ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా మ‌హేష్ చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ``మ‌న భూగ్ర‌హానికి ఊపిరితిత్తులు అని చెప్పుకునే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది. భూమిపై నివ‌శించేవారంతా నిదుర లేవాల్సిన త‌రుణ‌మిద‌ని గ్ర‌హించాలి. అమెజాన్ కోసం ప్రార్థించండి`` అంటూ అమెజాన్ అడ‌వులు త‌గ‌ల‌బ‌డుతున్న దృశ్యం ఫోటోని మ‌హేష్ ఫ్యాన్స్ కి షేర్ చేశారు. భూగ్ర‌హం ఊపిరి తిత్తులు త‌గ‌ల‌బ‌డిపోతున్నాయ్! అంటూ మ‌హేష్ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంపై అభిమానుల్లో పెద్ద డిబేట్ న‌డిచింది.

తాజాగా తెలంగాణ‌లోని న‌ల్ల‌మ‌ల అడ‌వుల విష‌య‌మై మ‌హేష్ స్పందించ‌క‌పోవ‌డంపై అదే అభిమానులు ఇప్పుడు నిల‌దీస్తున్నారు. అమెజాన్ త‌గ‌ల‌బ‌డితే స్పందించిన మ‌హేష్ ఎందుక‌ని న‌ల్ల‌మ‌ల త‌వ్వ‌కాల వ్య‌వ‌హారంపై స్పందించ‌డం లేదు? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీస్తున్నారు. మ‌హేష్ డ‌బుల్ స్టాండార్డ్ (ద్వంద్వ వైఖ‌రి) త‌గ‌దంటూ నిల‌దీయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. యురేనియం త‌వ్వ‌కాల పేరుతో ప్ర‌భుత్వాలు అడ‌వుల్ని ధ్వంశం చేస్తుంటే నిల‌దీయాల్సిన‌ది పోయి దీనిపై మ‌హేష్ ఎందుక‌ని ద్వంద్వ వైఖ‌రిని అవ‌లంబిస్తున్నారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం త‌వ్వ‌కాల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది మొద‌లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉద్య‌మాలు మొద‌ల‌య్యాయి. దీనివ‌ల్ల రెండు తెలుగు రాష్ట్రాల వాతావ‌ర‌ణం క‌లుషిత‌మ‌వుతుంది. పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ర‌సాయ‌న కార‌క‌ రేణువులు వాతావ‌ర‌ణంలో క‌ల‌వ‌డం ద్వారా మాన‌వాళికి ముప్పుగా ప‌రిణ‌మిస్తాయ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అలాగే ఆక్సిజ‌న్ కంటెంట్ కూడా త‌గ్గిపోతుంది. దీనిపై ఇప్ప‌టికే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా విజ‌య్ దేవ‌ర‌కొండ- సాయిధ‌ర‌మ్ తేజ్ వంటి హీరోలు స్పందించారు. మ‌హేష్ స‌హా ప‌లువురు టాప్ హీరోలు స్పందించ‌క‌పోవడాన్ని ప‌లువురు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులాంటి నల్లమల అడవులు సర్వనాశనమవుతాయనే భ‌యం లేదా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.


Tags:    

Similar News