రాజేంద్రప్రసాద్‌ ను మహేష్ నిలదీసిన వేళ..

Update: 2016-04-02 09:52 GMT
60 ఏళ్ల వయసులోనూ నటుడిగా తన ప్రత్యేకత చాటుకుంటూ ఉండటం తన అదృష్టమని అన్నాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. తనపై ప్రచురితమైన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాజేంద్రప్రసాద్ తన ప్రస్థానం గురించి.. ఈ తరం యువ కథానాయకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..

‘‘ఈపాటికి రిటైరైపోయి ఇంట్లో కూర్చుని భార్యతో వంటల గురించి మాట్లాడుతూ ఉండాల్సిన వాడిని. కానీ ఇప్పటికీ నా కెరీర్ అద్భుతంగా సాగుతూ ఉంది. ఇదే ఉత్సాహంతో ఇంకో పదేళ్లు ఇరవయ్యేళ్లు నటిస్తూ పోతానేమో. ఈ వయసులో కూడా నా కోసం ఓ పెద్ద దర్శకుడు ‘నాన్నకు ప్రేమతో’ అనే కథ రాసి తీసుకురావడం నా అదృష్టం. ఇప్పటికీ నన్ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. ఈ తరం యువ కథానాయకులకు చాలా స్టామినా ఉంది. వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నారు. అలాంటి కథానాయకులతో కలిసి పనిచేయడం నాకు లభించిన వరం.

శ్రీమంతుడు సినిమా చేయడం నాకు లభించిన గొప్ప అవకాశం. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ నన్ను ఆటపట్టించేవాడు. ఓ రోజు సీరియస్ గా నా దగ్గరికి వచ్చి సంవత్సరానికి అప్పట్లో ఎన్ని సినిమాలు చేసేవారు అని అడిగాడు. పదో పన్నెండో అని చెప్పాను. అలా ఎలా చేస్తారండీ అని నిలదీశాడు. ‘‘ఏం బాబూ తప్పా.. ఏదో అలా కలిసొచ్చింది.. రచయితలు రాసి పారేశారు.. దర్శకులు తీసి పారేశారు’ అన్నాను. ‘అలా ఎలా చేస్తారండీ.. మాకిక్కడ సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే కష్టమవుతోంది. కొన్నిసార్లు మూడేళ్లకు కూడా ఓ సినిమా పూర్తి కావట్లేదు.. అలా ఎలా చేస్తారు’ అంటూ సరదాగా నిలదీశాడు’’ అని చెప్పాడు రాజేంద్రప్రసాద్.
Tags:    

Similar News