క‌న్విన్స్‌​ ​చేస్తే చూపించేందుకు మ‌హేశ్ సిద్ధ‌మ‌ట‌

Update: 2017-09-24 05:19 GMT
ప్రిన్స్ మ‌హేశ్ బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కూల్ గా ఉంటూ.. సినిమాలే త‌న లోకంగా గ‌డిపేసే ఆయ‌న‌.. మ‌రేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటాడు. ఈ మ‌ధ్య‌న బ్రాండ్ అంబాసిడ‌ర్ గా జోరు పెంచేస్తున్న ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి చాలా కాల‌మే అయ్యింది. ఈ వారంలో మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన స్పైడ‌ర్ మూవీతో వెండితెర మీద త‌ళుక్కుమ‌న‌బోతున్నారు.

భారీ బ‌డ్జెట్ తో తెలుగు.. త‌మిళంలో నిర్మించిన ఈ మూవీ మీద అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అధికారికంగా రూ.120 కోట్ల బ‌డ్జెట్ తో తీసిన‌ట్లుగా చెబుతున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు షురూ అయ్యాయి. విడిగా ఉన్న‌ప్పుడు మీడియాలో అందుబాటులోకి ఉండ‌ని మ‌హేశ్‌.. సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా మాత్రం కోరినంత స‌మ‌యాన్ని ఇచ్చేస్తుంటారు.

తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చాలానే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

గ‌డిచిన కొన్నేళ్లుగా ప‌లువురు హీరోలు త‌మ బాడీని ప్ర‌ద‌ర్శించేందుకు ఏ మాత్రం మొహ‌మాటం ప‌డ‌టం లేదు. అయితే.. మ‌హేశ్ బాబు అలాంటి ప‌ని చేయ‌లేదు. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న వేస్తే.. బాడీ చూపించే విష‌యంలో త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని.. కాకుంటే ప్ర‌త్యేకంగా చూపించ‌టం అంటే త‌న‌కిష్టం ఉండ‌ద‌ని తేల్చాడు. ఇప్ప‌టివ‌ర‌కైతే త‌న‌కు అలాంటి ప‌రిస్థితులు ఎదురు కాలేద‌ని.. కానీ.. నేనొక్క‌డినే చిత్రంలో సుకుమార్ క‌న్వీన్స్ చేయ‌టంతో బ్యాక్ షాట్‌ కు స‌రేన‌న్న‌ట్లు చెప్పారు. సో.. మ‌హేశ్‌ ను క‌న్వీన్స్ చేస్తే.. సిక్స్ ప్యాక్‌ లో అయినా చూపిస్తార‌న్న మాట‌. కానీ.. ఆ స్థాయిలో ప్రిన్స్ ను క‌న్వీన్స్ చేసే స‌త్తా ఎవ‌రికుంది?

ఫిట్ నెస్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఇవాల్టి రోజుల్లో న‌టుడికి ఫిట్ నెస్ లేదంటే కుద‌ర‌ద‌ని.. ప్ర‌తిఒక్క‌రికి అవ‌స‌ర‌మ‌న్నాడు. లైఫ్ స్టైల్‌లో ఫిట్‌నెస్ అన్న‌ది ప్ర‌తిఒక్క‌రికి అవ‌స‌ర‌మేన‌న్నాడు. సిక్స్ ప్యాక్ లేకున్నా.. తాను చాలా ఫిట్ అని చెప్పాడు. న‌ల‌భై దాటినా అలా క‌నిపించ‌రే.. ఛార్మింగ్ సీక్రెట్ ఏమిటంటే..న‌వ్వేస్తూ.. ఆనందంగా న‌వ్వుతూ ఉండ‌టమ‌ని చెప్పిన మ‌హేశ్‌.. బాధ‌లు క‌లిగినా వాటి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌ట‌మే త‌న ర‌హ‌స్యంగా చెప్పాడు. ఎంత హ్యాపీగా ఉంటే అంత యంగ్ గా క‌నిపిస్తామ‌న్నారు.

ఇంట్లో పిల్ల‌ల‌తో తాను గ‌డిపే టైం గురించి చెబుతూ.. త‌న కుటుంబ‌మే త‌న‌కు పెద్ద బ‌లంగా మ‌హేశ్ అభివ‌ర్ణించాడు. ఎంత ప‌ని ఒత్తిడిలో ఉన్నా.. ఇంటికి వెళ్లి పిల్ల‌ల‌తో కాసేపు ఆడుకుంటే టెన్ష‌న్ మొత్తం త‌గ్గిపోతుంద‌న్న మ‌హేశ్‌.. గౌత‌మ్ కు ఇప్పుడు ప‌ద‌కొండేళ్ల‌ని.. ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ట్లు చెప్పాడు. కూతురు సితార అల్ల‌ర‌ల్ల‌రి చేస్తోంద‌ని.. త‌ను ప్లే స్కూల్ కు వెళుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. వాళ్ల‌తో గ‌డిపితే ఒత్తిడి మొత్తం ఎగిరిపోతోంద‌ని.. సినిమా గురించే మ‌ర్చిపోతాన‌ని.. వారితో క‌లిసి ఉన్న టైంను ఎంజాయ్ చేస్తాన‌న్నాడు.

న‌మ్ర‌త ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు మ‌హేశ్ ముఖంగా న‌వ్వు వ‌చ్చేసింది. న‌మ్ర‌త త‌న ప‌ట్ల తీసుకునే కేర్ విష‌యంలో తాను ల‌క్కీ అని చెప్పుకున్నాడు. త‌ను చాలా సంతోషంగా ఉన్నాన‌ని.. ఇంటికి వెళ్ల‌గానే మిగిలిన టెన్ష‌న్లు ఏవీ త‌న‌పై ప‌డ‌కుండా న‌మ్ర‌త చూసుకుటుంద‌న్నాడు. ఒక యాక్ట‌ర్‌కు అలాంటివి చాలా అవ‌స‌ర‌మ‌ని.. సాధార‌ణంగా బ‌య‌ట కుటుంబాల్లో ఎలా ఉంటారో ఒక ఫ్యామిలీగా తాము అలాగే ఉంటామ‌న్నాడు.

ఇంట్లో ఆడుకోవ‌టం.. మాట్లాడుకోవ‌టం.. ఎవ‌రికి కావాల్సిన‌వి వాళ్లం తిన‌టం.. టీవీ చూడ‌టం లాంటివి చేస్తామ‌న్నాడు. కాకుంటే ట్రెడిషిన‌ల్ గా అంద‌రం కూర్చొని భోజ‌నం చేయ‌టం లాంటివి మాత్రం ఉండ‌వ‌న్నాడు. తాను ద‌త్త‌త తీసుకున్న రెండు గ్రామాల్లో (తెలంగాణ‌లో సిద్ధాపురం.. ఏపీలో బుర్రిపాలెం) ప‌నులు చాలా బాగా జ‌రుగుతున్నాయ‌ని.. ఆ ప‌నుల్ని న‌మ్ర‌త చూసుకుంటుంద‌ని.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు తాను వెళుతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాను వేదిక‌గా తీసుకొని ఒక‌రి అభిమానులు మ‌రొక‌రిపై దుమ్మెత్తి పోసుకోవ‌టం క‌నిపిస్తుంది. మ‌రి.. ఇలాంటి వాటిపై మ‌హేశ్ అభిప్రాయాన్ని చెబుతూ.. ఒక‌రిని బాధించ‌నంత‌వ‌ర‌కూ.. న‌ష్టం వాటిల్ల‌కుండా చేసేంత‌వ‌ర‌కూ ఫ‌ర్లేదు కానీ.. అవేవీ హ‌ద్దులు దాట‌కూడ‌ద‌ని త‌న అభిమానుల‌కు తాను చెబుతుంటాన‌ని చెప్పాడు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియా చాలా ఎఫెక్టివ్ గా ఉంద‌ని.. దాని వ‌ల్ల సినిమాకు చ‌క్క‌టి ప్ర‌చారం ల‌భిస్తోంద‌న్నాడు. సినిమా బాగుంటే ఓకే కానీ.. సినిమా బాగుండ‌క‌పోతే మాత్రం సోష‌ల్ మీడియా కార‌ణంగా న‌ష్టం ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌న్నాడు. మొత్తంగా సోష‌ల్ మీడియా అంటే ఓ యాంగిల్ లో మాత్రం మంచిదేన‌న్నాడు.


Tags:    

Similar News