ఆ ఫంక్షన్‌కు మహేష్‌ ఆయన్ని పిలుస్తాడా?

Update: 2015-07-06 11:30 GMT
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి ఇంకో నాలుగు రోజుల్లో విడుదలైపోతోంది. కనీసం వారం రోజుల పాటు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం బాహుబలి గురించే చర్చించుకుంటుందనడంలో సందేహం లేదు. ఐతే ఆ తర్వాత 'శ్రీమంతుడు' సందడి మొదలు కానుంది. టాలీవుడ్‌ గర్వించదగ్గ సినిమా అంటూ 'బాహుబలి' మీద గౌరవంతో తమ సినిమాను ముందుగా అనుకున్నదానికంటే 20 రోజులు వాయిదా వేసుకున్న శ్రీమంతుడు టీమ్‌.. బాహుబలి సందడి కొంచెం తగ్గగానే తమ సినిమా ప్రమోషన్‌ మొదలుపెట్టనుంది.

ఇందులో భాగంగా ముందుగా జులై 18న ఆడియో ఫంక్షన్‌ చేయాలనుకుంటున్నట్లు ఆ మధ్య చూచాయిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ డేటుకే ఆడియో ఫంక్షన్‌ కన్ఫమ్‌ చేశారు. హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమం జరగబోతోంది. 'శ్రీమంతుడు' యూనిట్‌ సభ్యులతో పాటు సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మహేష్‌ తర్వాతి సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించనున్న నేపథ్యంలో ఈ కార్యమ్రానికి ఆయన్నే ముఖ్య అతిథిగా పిలవొచ్చని.. ఈ వేదిక మీదే వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి అనౌన్స్‌ చేయవచ్చని చెబుతున్నారు.

ఇక శ్రీమంతుడు ఆడియో విశేషాల సంగతి చూస్తే.. '1 నేనొక్కడినే' తర్వాత మరోసారి మహేష్‌ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి. అందులో ఒకటి ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కాగా.. రామా, రామా, సుందరీ.., జాగోరే, దిమ్మ తిరిగిపోద్ది అనే ఇంకో నాలుగు పాటలున్నాయి. ఒకటి బిట్‌ సాంగ్‌. సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో దేవిశ్రీ ఆడియో ఇచ్చినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News