పంచెకట్టులో రాబోతున్న పోకిరి

Update: 2017-12-23 04:51 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను అన్నివిధాలుగా మెప్పించేలా శ్రీమంతుడు సినిమా తీసి అతడి కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హ్యాట్రిక్ చిత్రాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం వరస పరాజయాలతో కాస్త డల్ అయిన మహేష్ అభిమానుల్లో జోష్ నింపేలా ప్రస్తుతం తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూస్తున్నాడు.

శ్రీమంతుడు సినిమాలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు. ఆ లుక్ అభిమానులకు తెగ నచ్చేసి విజిల్స్ మోత మోగాయి. ఇప్పుడు తీస్తున్న భరత్ అనే నేనులో ఫ్యాన్స్ కోసం అచ్చ తెలుగు పంచెకట్టుతో ఓ పాట తీయాలని డైరెక్టర్ కొరటాల శివ ఆలోచన చేస్తున్నాడట. ‘‘ఇంతకు ముందు పోకిరి.. శ్రీమంతుడు రెండు సినిమాల్లోనూ మహేష్ లుంగీతో కనిపించిన పాటలు మాస్ కు తెగనచ్చేశాయి. ఇప్పుడు పంచెకట్టుతో కనిపించడం కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. ఫిలిం మేకర్లకు కూడా ఈ ఐడియా బాగానే వర్కవుట్ అవుతుందనిపించింది. అయితే ఇంకా ఈ ప్రపోజల్ ఇంకా మహేష్ ఇంకా చెప్పలేదు. కచ్చితంగా ఓకే చెబుతాడని డైరెక్టర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు’’ అని సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

భరత్ అనే నేను సినిమాలో మహేష్ కెరీర్ లో మొదటి సారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది హుందాగా ఉండే పాత్ర కాబట్టి పంచెకట్టు కూడా బాగానా సూటవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతోంది.  


Tags:    

Similar News