నాన్న ఊరిలో మహేష్ స్కూల్

Update: 2018-02-28 10:22 GMT
మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకోవడం అనే పాయింట్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. మంచి చేయటం కోసం కోట్ల విలువైన ఆస్తులను ప్రజల కోసం ఖర్చు పెట్టడం అనే కాన్సెప్ట్ కు బ్రహ్మరధం పట్టి కాసుల వర్షం కురిపించారు. ఆ సమయంలోనే హీరో మహేష్ బాబు ఇలాంటివి సినిమాల వరకేనా నిజ జీవితంలో ఆచరించేది ఏమైనా ఉందా అని కొన్ని కామెంట్స్ వినిపించాయి. వాటికి జవాబు చెప్పాలని కాదు కాని నిజంగానే మహేష్ బాబు అందులో చూపించినట్టే ఊరి దత్తతకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా తాను ప్రతి సారి వెళ్ళలేడు కనక తన శ్రీమతి నమ్రతా శిరోద్కర్ ను మాత్రం రెగ్యులర్ గా అక్కడ పర్యవేక్షణకు పంపుతూనే ఉన్నాడు మహేష్. దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో ఒకటి ఆంధ్రలో బుర్రిపాలెం కాగా రెండోది తెలంగాణాలో సిద్దాపురం.

ప్రస్తుతం బుర్రిపాలెంలో తన స్వంత డబ్బుతో మహేష్ నిర్మించిన స్కూల్ ప్రారంభోత్సవం జరుపుతుంది. నాన్న స్వంత ఊరైన బుర్రిపాలెం అంటే మహేష్ తో సహా కుటుంబంలోని అందరికి ప్రత్యేకమైన అభిమానం. అందుకే అక్కడి నుంచే పనులు మొదలు పెట్టారు. తన నాన్నమ్మ నాగరత్నమ్మ రాజాల పేరు మీద ఈ స్కూల్ కు నామకరణం చేసారు. స్థానిక ఎమెల్యే రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. తొలుత మహేష్ దంపతుల చేతుల మీదుగా చేయించాలి అనుకున్నప్పటికీ షూటింగ్ తదితర కారణాల వల్ల అది కుదరలేదు. ఏదైతేనేం మహేష్ స్కూల్ వల్ల అక్కడ ఉన్న ఎందరో విద్యార్థులకు మేలు జరగనుంది.

ఈ స్కూల్ మొదలు పెట్టిన బుర్రిపాలెం పేరు మీద గతంలో ఒక సినిమా వచ్చింది. బుర్రిపాలెం బుల్లోడు పేరుతో వచ్చిన ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అందులో హీరొయిన్ ఎవరో కాదు . దివంగత శ్రీదేవి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ బుర్రిపాలెంలోనే మహేష్ స్కూల్ ప్రారంభించడం పట్ల మహేష్ అభిమానులతో పాటు అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.  

Tags:    

Similar News