'మేజర్' ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద శేష్ జోరు..!

Update: 2022-06-04 08:30 GMT
26/11 ముంబై టెర్రర్ అటాక్స్ రియల్‌ హీరో మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''మేజర్''. ఇందులో వర్సటైల్ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించారు. కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ బయోపిక్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ప్రివ్యూలతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

ఈ నేపథ్యంలో ''మేజర్'' సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 13.4 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్. ఇక హిందీ బెల్ట్ లో దాదాపు 1 కోటి వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ గా నిలిబడింది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. మౌత్ టాక్ - పాజిటివ్ రివ్యూలతో రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళు అందుకునే అవకాశం ఉంది.

26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలియని ఎన్నో విషయాలను ''మేజర్'' సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ముంబై దాడుల్లో సందీప్ ప్రాణాలు త్యాగం చేసారని అందరికి తెలుసు. కానీ ఆయన ఎలా జీవించాడు? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? బాల్యం ఎలా సాగింది? ఆర్మీలో చేరడానికి అతనికి స్ఫూర్తి కలిగించిన అంశాలేంటి? అనేది ఈ సినిమాలో చూపించారు.

తల్లిదండ్రులపై మేజర్ కి ఉన్న ప్రేమ.. యవ్వనంలో లవ్‌ స్టోరీ.. దేశం పట్ల ఆయనకున్న ప్రేమను.. ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని.. ప్రాణాలకు తెగించి ఉగ్రమూకలను మట్టుబెట్టడం.. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టడం.. ఇలా ప్రతీదీ కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు.

'మేజర్' నిర్మాణంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా పాలుపంచుకోవడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. దీనికి తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ జీవించాడనే చెప్పాలి. ఎమోషన్స్‌ పలికిస్తూనే.. హీరోయిజాన్ని తెరపై చూపిస్తూ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు.

నిజమైన సైనికుడి మాదిరి శేష్ తన శరీరాన్ని మార్చుకున్న విధానాన్ని అందరూ అభినందించాల్సిందే. ఈ సినిమా కోసం య్యువ హీరో పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. మేజర్ ప్రేయసి ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్‌.. తల్లితండ్రులుగా ప్రకాశ్‌ రాజ్‌ - రేవతి.. తాజ్ హోటల్‌ లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతిగా శోభిత ధూళిపాళ్ల.. ఆర్మీ ఆఫీసర్ గా మురళీ శర్మ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు

''మేజర్'' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ - ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు కలిసి ఈ పాన్ ఇండియా బయోపిక్ ని నిర్మించాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Tags:    

Similar News