మూవీ రివ్యూ: మలుపు

Update: 2016-02-19 14:57 GMT
చిత్రం : మలుపు

నటీనటులు: ఆది పినిశెట్టి  - నిక్కీ గర్లాని - మిథున్ చక్రవర్తి - శ్రావణ్ - రిచా - పశుపతి - హరీష్ ఉత్తమన్ - నరేన్ - ప్రగతి తదితరులు
సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్
ఛాయాగ్రహణం: షణ్ముగ సుందరం
నిర్మాత: రవిరాజా పినిశెట్టి
రచన - దర్శకత్వం: సత్యప్రభాస్ పినిశెట్టి

సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది.. తమిళంలో హీరోగా మంచి పేరే సంపాదించాడు. ఐతే తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. తెలుగులో అతను డైరెక్టుగా చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. ఐతే డబ్బింగ్ సినిమా ‘వైశాలి’ మాత్రం మెప్పించింది. ఇప్పుడు మరోసారి ‘మలుపు’ అనే మరో డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆది. మంచి ప్రమోషన్లతో జనాల్లో ఆసక్తి రేపిన ఈ థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సగ అనే షార్ట్ నేమ్ కలిగిన సతీష్ గణపతి (ఆది) తండ్రి మాటల్ని పట్టించుకోకుండా తన స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరిగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఐతే ఒక రెస్టారెంట్లో అతడి స్నేహితులు చేసిన గొడవ వల్ల అందరూ ఇబ్బందుల్లో పడతారు. వీళ్ల చేతిలో అవమానానికి గురైన ప్రియా (రిచా).. ముంబయి డాన్ మొదలియార్ కూతురని తెలుస్తుంది. ప్రియా కనిపించకుండా పోవడంతో మొదలియార్ గ్యాంగ్ అంతా సగ, అతడి ఫ్రెండ్స్ మీద పడుతుంది. ఈ స్థితిలో సగ ఏం చేశాడు.. తనతో పాటు తన స్నేహితుల్ని ఎలా కాపాడుకున్నాడు.. ఇంతకీ ప్రియా ఏమైంది.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

తండ్రి నిర్మాత.. పెద్ద కొడుకు హీరో.. చిన్న కొడుకు దర్శకుడు.. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అన్నపుడు.. సాధారణంగా కమర్షియల్ సినిమాలే ఆశిస్తాం. మాస్ మసాలా కథతో హీరోయిజం ఎలివేట్ చేయడానికే ప్రయత్నిస్తారని అనుకుంటాం. కానీ రవిరాజా ఫ్యామిలీ మాత్రం అలాంటి రొటీన్ ప్రయత్నాలేమీ చేయకుండా ఓ డీసెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా డెబ్యూ డైరెక్టర్ సత్యప్రభాస్ డీసెంట్ థ్రిల్లర్ మూవీని అందించే ప్రయత్నం చేశాడు. కథలో హీరో ఉంటాడు తప్ప.. ఇది హీరో కోసం కథ కాదు.

మలుపు.. మూడు నాలుగు రోజుల వ్యవధిలో ముగిసిపోయే కథ. ఓ చిన్న గొడవ కారణంగా నలుగురు మిత్రుల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయో చూపించే చిత్రమిది. ఆ సంఘటనకు అటు ఇటు కథనాన్ని అల్లుకున్నాడు దర్శకుడు. నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రథమార్ధమంతా హీరో నేపథ్యం.. అతడి ప్రేమకథతో నడిపించాడు. ప్రేమకథ వల్ల సినిమాకు ఎంతవరకు ప్రయోజనం అన్నది పక్కనబెడితే.. ఆ ట్రాక్ సరదాగా సాగి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సమయానికి కూడా అసలు సమస్యలోకి వెళ్లలేదు దర్శకుడు.

ద్వితీయార్ధంలో కథను మలుపు తిప్పే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ను ఆసక్తికరంగా ముగించి.. సస్పెన్స్ ఎలిమెంట్ ను చివరిదాకా దాచి పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ తర్వాత 40 నిమిషాల కథనం థ్రిల్లింగా సాగుతుంది. అసలేం జరిగిందో గుట్టు విప్పే సన్నివేశం సినిమాకు హైలైట్. అది చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఐతే క్లైమాక్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. థ్రిల్లర్ మూవీకి ఇది సరైన ముగింపు కాదు. మిథున్ చక్రవర్తిని హైలైట్ చేద్దామన్న ఉద్దేశమో ఏంటో కానీ.. క్లైమాక్స్ సినిమా టోన్ కు తగ్గట్లుగా లేదు. సినిమా అప్పటికే ముగిసిపోయినా.. ఊరికే ఇంకో పావుగంట సాగదీశారు.

హీరో ఓవైపు వర్తమానంలో క్లూస్ కోసం ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఫ్లాష్ బ్యాక్ లో సమాంతరంగా లవ్ స్టోరీని నడిపించడం.. ద్వితీయార్ధం పూర్తిగా థ్రిల్లర్ తరహాలో నడిపించడం.. ఇవన్నీ చూస్తే సత్యప్రభాస్ ‘వైశాలి’ ఫార్మాట్ ఫాలో అయినట్లుగా కనిపిస్తుంది. ఐతే ‘వైశాలి’ స్థాయిని ‘మలుపు’ అందుకోలేదు. అయినప్పటికీ ఇది కూడా డీసెంట్ థ్రిల్లరే. ఫస్టాఫ్ లో రొమాంటిక్ ట్రాక్ బాగానే ఉన్నప్పటికీ దానికి, కథకు సంబంధం లేదు. అక్కడక్కడా పాటలు అనవసరంగా అడ్డం పడతాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో క్లబ్ సాంగ్ అనవసరం. థ్రిల్లర్ సినిమాలు సాధ్యమైనంత వరకు తక్కువ నిడివితో ఉంటే బాగుంటాయి. వైవిధ్యమైన కథనే ఎంచుకున్నపుడు మళ్లీ ఇక కమర్షియల్ అంశాల కోసం వెంపర్లాడటం దేనికి? రెండు పాటలు తీసేసి.. కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత మెరుగ్గా తయారయ్యేది.

నటీనటులు:

‘ఒక విచిత్రం’ తర్వాత ‘వైశాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయమైన ఆది.. ‘మలుపు’లోనూ మరో మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు. ఎక్కువ ఎమోషన్లు పలికించకుండా ఇంట్రావర్ట్ లాగా కనిపించే పాత్రలో మెచ్యూర్డ్ గా నటించాడు. అనవసర బిల్డప్పులేమీ లేకుండా మామూలుగా సాగిపోయే అతడి పాత్ర ఆకట్టుకుంటుంది. హీరోయిన్ నిక్కీ గర్లాని కూడా బాగానే చేసింది. రొమాంటిక్ ట్రాక్ లో హీరో కంటే కూడా ఆమె పాత్రతోనే ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు. కనిపించినంత సేపూ చాలా ఉత్సాహంగా సాగుతుంది ఆ పాత్ర. ఐతే ద్వితీయార్ధంలో ఆమె పాత్రను పూర్తిగా పక్కనబెట్టేస్తారు. మిథున్ చక్రవర్తి మొదలియార్ పాత్రలో మెప్పించాడు. క్లోజప్ షాట్లలో ఆయన చక్కటి హావభావాలు పలికించాడు. తెలుగు నటుడు శ్రావణ్ కీలక పాత్రలో రాణించాడు. రిచాతో పాటు శాడిస్టు లవర్ పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది.

సాంకేతిక వర్గం:

ప్రసన్ పాటల్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాట బాగుంది. మిగతావి ఏదో అలా సాగిపోతాయి. పాటలు చాలావరకు సినిమాలో స్పీడ్ బ్రేకర్స్ లాగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సినిమాకు తగ్గట్లుగా బాగా కుదిరింది. షణ్ముగ సుందరం ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాత రవిరాజా పినిశెట్టి కొడుకుల సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. సినిమా రిచ్ గా తెరకెక్కింది. రవిరాజా చిన్న కొడుకైన డైరెక్టర్ సత్యప్రభాస్ పినిశెట్టికిది ప్రామిసింగ్ డెబ్యూనే అని చెప్పాలి. రియల్ స్టోరీని మంచి థ్రిల్లర్ గా తీర్చిదిద్దడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. రొమాంటిక్ ట్రాక్ ను సరదాగా నడిపించడంలో ప్రతిభ చూపించిన సత్యప్రభాస్.. థ్రిల్ మూమెంట్స్ తో సాగే ద్వితీయార్ధాన్ని కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. ఐతే చెప్పాలనుకున్న పాయింటుని దాటి.. కొన్ని చోట్ల డీవియేట్ అయిపోవడం సమస్య. కమర్షియల్ ఎలిమెంట్స్ మీద దృష్టిపెట్టకుండా నేరుగా కథను చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది.

చివరగా: మలుపు.. వాచబుల్ థ్రిల్లర్.

రేటింగ్- 2.75/5
Tags:    

Similar News