ఇంతకీ ఇద్దరిలో 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ట్యాగ్ ఎవరికి సొంతం..?

Update: 2022-05-30 15:30 GMT
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి సర్వ సాధారణం. ఆధిపత్యం చూపించుకోవడానికి ఓ వర్గం అభిమానులు ఇతర హీరోలను ట్రోల్ చేస్తూ వారి ఫ్యాన్స్ తో గొడవకు దిగుతుంటారు. బాక్సాఫీస్ లెక్కలు - బ్లాక్ బస్టర్ సినిమాలు అంటూ తమ హీరోనే గొప్ప అని నిరూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఓ ట్యాగ్ కోసం ఈ మధ్య ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ పేరు కాకుండా ఏదొక ట్యాగ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు వారిని ఆ నేమ్ తో పిలవడానికే ఇష్టపడుతుంటారు. ట్యాగ్ ఉంటేనే స్టార్ డమ్ ఉన్నట్లుగా భావించేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే హ్యాష్ ట్యాగ్ కోసం RRR హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇద్దరూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తమకంటూ ప్రత్యేకమైన పేరు గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద తలపడే మెగా - నందమూరి ఫ్యామిలీలకు చెందిన చరణ్ - తారక్ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్ లో చాలా సన్నిహితంగా ఉంటారు. 'ఆర్.ఆర్.ఆర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావడానికి వారి బ్రోమాన్స్ కూడా కారణమనే అనుకోవాలి. ఈ విషయాన్ని హీరోలిద్దరూ అంగీకరిస్తారు. అయితే వారి ఫ్యాన్స్ మాత్రం నిత్యం నెట్టింట ఫైట్ చేసుకుంటూనే ఉంటారు.

'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ కోసం ఎన్టీఆర్ - చరణ్ అభిమానులు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఆ ట్యాగ్ తమ హీరోకి తప్ప మరెవరికీ సూట్ అవ్వదని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తారక్ కు ఈ ట్యాగ్ ఎప్పటి నుంచో ఉందని ఓ వర్గం అంటుంటే.. మెగా వారసుడికే సొంతమని మరో వర్గం అంటోంది.

చిరంజీవి నటించిన 'అందరివాడు' సినిమాకు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనేది ఉపశీర్షిక. ఇప్పుడు దానికి రామ్ చరణ్ తగిన వాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్టీఆర్ మాత్రమే ఆ ట్యాగ్ కు అర్హుడని నందమూరి అభిమానులు అంటున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు హీరోల హిట్లు ప్లాపులు - బాక్సాఫీస్ కలెక్షన్స్ దగ్గర నుంచి 'ఆర్.ఆర్.ఆర్' సక్సెస్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే విషయం వరకూ.. అన్నీ ప్రస్తావిస్తూ ఒకరిపై మరొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. మరి 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ట్యాగ్ ఎవరికి సెట్ అవుతుందనే దానిపై న్యూట్రల్ ఆడియన్స్ మరియు ఇతర హీరోల ఫ్యాన్స్ ఏమంటారో..!
Tags:    

Similar News