సెట్టయిన మాస్ రాజా.. ఇది అసలు మ్యాటర్

కానీ రవితేజకు ఆరోగ్య విషయంలో డౌట్ అక్కర్లేదని సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు.

Update: 2024-10-03 01:30 GMT

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడి షోల్డర్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ గాయంతో రవితేజని డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రవితేజ కూడా డాక్టర్ల సలహాని పాటించి నాలుగు వారాలు విశ్రాంతి తీసుకుంటున్నారు. అభిమానులందరూ ఆయన ఆరోగ్యం పట్ల మొదట ఆందోళన వ్యక్తం చేయగా ఒక పాత ఫొటో కూడా వైరల్ అయ్యింది. కానీ రవితేజకు ఆరోగ్య విషయంలో డౌట్ అక్కర్లేదని సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు.

ఇక జెట్ స్పీడ్ లోనే హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక రవితేజ కోలుకొని మళ్లీ సెట్స్‌కి వెళ్తున్నాడని మరో అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ 14వ తేదీ నుండి RT75 సినిమా షూటింగ్‌కి రవితేజ హాజరవుతారని సమాచారం. కొంత గ్యాప్ తరువాత మళ్లీ సెట్‌లోకి రావడానికి రెడీ అవుతున్న మాస్ మహారాజ్‌కి ఈ ప్రాజెక్ట్ మీద చాలా హైప్ ఉంది.

భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందట. ధమాకా తరువాత శ్రీలీల ఈ చిత్రంలో రవితేజతో జతకట్టడం మరో విశేషం. ఇప్పటికే శ్రీలీల తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌కి ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయింది. రవితేజ గాయం కారణంగా మధ్యలో చిన్న బ్రేక్‌ వచ్చినా, అక్టోబర్ 14 నుండి మిగతా షెడ్యూల్‌కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ పూర్తయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరింత వేగంగా పూర్తి కానున్నాయి.

అయితే మొదట సంక్రాంతి కానుకగా 2025 లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ షెడ్యూల్‌లో వచ్చిన మార్పుల కారణంగా, సినిమాను సంక్రాంతి సమయానికి రిలీజ్ చేయడం కుదరదని సమాచారం. మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌పై మరో ప్రకటన చేయనున్నారు. 2025 లో అనువైన మరో తేదీని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ పాత్రను పూర్తిగా కొత్తగా, ఎనర్జిటిక్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.

మాస్ ఎంటర్టైనర్‌తో పాటు మంచి కామెడీ, యాక్షన్ అంశాలతో సినిమా ఉండబోతోందట. ఇదిలా ఉంటే రవితేజ నుంచి ఇటీవల వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కాబట్టి రవితేజ ఈ కొత్త ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అభిమానులు కూడా మాస్ మహారాజ్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి RT75 సినిమా ఎలాంటి కంటెంట్ తో వస్తుందో చూడాలి.

Tags:    

Similar News