గ‌ణ‌ప‌తి మండ‌పాల‌పై మంచు లక్ష్మి ఫైర్‌

Update: 2017-08-26 06:57 GMT
సినీన‌టి మంచు ల‌క్ష్మికి కోపం వ‌చ్చింది. ఆగ్ర‌హం పొంగిపొర్లింది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఏర్పాటు చేసిన వేలాది గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల కార‌ణంగా ప్ర‌జ‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. వినాయ‌క విగ్ర‌హాల కోసం ఏర్పాటు చేసిన వేలాది పందిళ్ల కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్న విష‌యాన్ని ఆమె తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఫిర్యాదు చేశారు.

తాను ఫిలిం న‌గ‌ర్ రోడ్డు నెంబ‌రు 1 లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు అక్క‌డ ఏర్పాటు చేసిన వినాయ‌క మండ‌పాలు.. స్వాగ‌త ద్వారాల కార‌ణంగా జ‌నం తీవ్ర అవ‌స్థ‌ల‌కు గురి అవుతున్న విష‌యాన్ని పేర్కొన్నారు. జ‌నం బాధ‌ల్ని తాను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని.. ఇది కేవ‌లం ఫిలింక్ల‌బ్ కే ప‌రిమితం కాలేద‌ని.. సిటీ మొత్తం ఇలాంటి ఇబ్బందే ఉంద‌ని పేర్కొన్నారు. గ‌ణ‌ప‌తి మండ‌పాల కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఆటంకాలు ఏర్ప‌డుతున్న విష‌యాన్ని త‌న కంప్లైంట్ లో పేర్కొన్నారు.

పందిళ్ల ఏర్పాటును భ‌క్తిభావం కంటే పోటీతోనే పెడుతున్నార‌న్నారు. ప‌లు చోట్ల పెద్ద విగ్ర‌హాల్ని ఏర్పాటు చేసిన కార‌ణంగా కేబుళ్ల‌ను తెంచి పారేస్తున్నార‌ని.. త‌ర్వాత వాటిని అలానే వ‌దిలేస్తున్నార‌ని.. వాటికి ఎవ‌రుబాధ్య‌త వ‌హిస్తారని ఆమెప్ర‌శ్నిస్తున్నారు.

ఇప్పుడు వినాయ‌క‌చ‌వితిని మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మం కంటే కూడా పోటీ పండ‌గ్గా చేస్తున్నార‌ని.. విగ్ర‌హాల ఏర్పాట్ల‌లో పోటీ కోస‌మే జ‌రుగుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. జ‌నం ప‌డుతున్న ఇబ్బందుల్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తెస్తున్న‌ట్లుగా పేర్కొన్న మంచుల‌క్ష్మి.. ఇలాంటి వాటిపై తక్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకొని ప్ర‌జ‌లను ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కించాల‌న్నారు. వినాయ‌క విగ్ర‌హాల ఎత్తు విష‌యంలో కొంత ప‌రిమితికి లోబ‌డి ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు. మ‌రి.. మంచుల‌క్ష్మి సూచ‌న‌కు మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News