'మా' ను షేక్ చేసే లెట‌ర్ రాసిన మంచు విష్ణు

Update: 2018-04-19 05:14 GMT
క్యాస్టింగ్ కౌచ్ పై సినీ న‌టి శ్రీ‌రెడ్డి మొద‌లెట్టిన పోరాటం ప‌లు మ‌లుపులు తిరుగుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ నోరు విప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ని వారంతా ఇప్పుడు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. త‌మ అభిప్రాయాల్ని చెబుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్.. పొట్టిగా మా అని పిలుచుకునే సంస్థ‌లోనూ ఇప్పుడు లుక‌లుక‌లు మొద‌లైన‌ట్లుగా చెప్పాలి. మా నిర్ణ‌యాల్ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ లో మా పెద్ద‌లు చేసిన ప‌నిని క‌డిగినంత ప‌ని చేశారు సినీ న‌టులు మంచు విష్ణు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అనుస‌రించిన వ్య‌వ‌హార‌శైలిపై అభ్యంత‌రంతో పాటు.. అస‌హానాన్ని తాను రాసిన తాజా లేఖ‌లో ఆయ‌న ప్ర‌స్తావించారు. తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. మాలో స‌భ్య‌త్వం లేని శ్రీ‌రెడ్డిపై ఏ హ‌క్కుతో ఆంక్ష‌లు విధించార‌ని ప్ర‌శ్నించిన విష్ణు.. తిరిగి ఎందుకు ఎత్తివేశారు? అంటూ ప్ర‌శ్నించారు.

ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలు చాలా గంద‌ర‌గోళంగా ఉన్నాయ‌ని.. స‌భ్య‌త్వం లేని ఆమె చేసిన ఆరోప‌ణ‌ల ఆధారంగా హ‌డావుడిగా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌టంపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. మాలో ఉన్న 900 మంది స‌భ్యుల్లో ఏ ఒక్క‌రూ కూడా ఆమెతో న‌టించ‌కూడ‌ద‌ని మా ఆదేశాలు జారీ చేసింద‌ని.. ఆ స‌భ్యుల్లో త‌న తండ్రి మంచు మోహ‌న్ బాబు.. తాను.. త‌న త‌మ్ముడితో పాటు.. త‌న సోద‌రి కూడా ఉంద‌ని.. అంటే త‌మను కూడా క‌లిపేసి నిర్ణ‌యాన్ని చెప్పారా? అన్న విష్ణు.. ఎవ‌రిని అడిగి ఆ ఆదేశాలు ఇచ్చార‌ని నిల‌దీశారు.

నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత ఏదో పొడుచుకొచ్చిన‌ట్లుగా మీటింగ్ పెట్టి నిషేధాన్ని ఎత్తివేశార‌ని.. ఈ నిర్ణ‌యాల‌న్నీ "మా"పై వ్య‌తిరేక‌త పెరిగిపోవ‌టానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌న్నారు. "మీ చేష్ట‌ల‌తో మా ప్ర‌జ‌ల్లోనూ.. మీడియాలోనూ చుల‌క‌న అయిపోతోంది. ద‌య‌చేసి అనాలోచిత నిర్ణ‌యాల‌తో భ్ర‌ష్టు ప‌ట్టించ‌కండి" అంటూ నిప్పులు చెరిగారు.

శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ లో మా తీరును ఇంత తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టిన మంచు విష్ణు మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని లేవ‌నెత్తారు. అస‌లు న‌టీన‌టుల‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఏవి?  అంటూ ప్ర‌శ్నించారు.  

త‌క్ష‌ణ‌మే మార్గ‌ద‌ర్శ‌కాల్ని ఏర్పాటు చేయాల‌ని విష్ణు డిమాండ్‌ చేశారు. మాలో స‌భ్య‌త్వం లేని చాలామంది స్థానిక న‌టులు ఉన్నార‌ని.. వారంద‌రితో న‌టించేందుకు త‌న‌ను అనుమ‌తిస్తారా? అన్న విష్ణు.. క్యాస్టింగ్ కోచ్ ఆరోప‌ణ‌లు టాలీవుడ్ ప‌రువు తీసేస్తోంద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో గ్రీవెన్స్ సెల్ ను అత్య‌వ‌స‌రంగా ఏర్పాటు చేయాల‌ని.. అది కూడా మా కాకుండా ఫిలిం ఛాంబ‌ర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మ‌రి.. దీనిపై మా పెద్ద‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News