ఏపీ సీఎంతో చిరంజీవి భేటీపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!

Update: 2022-02-07 09:05 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశం మీద ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ దీనిపై కూలంకుషంగా చర్చిస్తోంది. ఇక టికెట్ రేట్ల వ్యవహారం మీద సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. అయితే సీఎంతో చిరు భేటీపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్‌ ను ఆవిష్కరించిన అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. జగన్ తో చిరంజీవి భేటీ వారి పర్సనల్ అని అన్నారు. దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదని.. సినిమా టికెట్లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుందని.. వ్యక్తిగతంగా తన నిర్ణయంతో పని లేదని విష్ణు పేర్కొన్నారు. వై.ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాసరి నారాయణరావు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ జీవోని మార్చారని.. దీనిపై చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచారు.. ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారన్నారు విష్ణు. టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని అన్నారు. టికెట్ ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళతామని.. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని హితవు పలికారు. లెజెండరీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌ బాబు, నాగార్జున, వెంకటేష్ తమకు ఆదర్శమని పేర్కొన్నారు.

రెండు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని తెలిపిన మంచు విష్ణు.. టికెట్ల అంశం మీద ఇప్పటికే అన్ని చాంబర్స్‌ తో చర్చలు జరుగుతున్నాయని.. అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. టిక్కెట్స్ ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసిందని.. అడిగితే తాము కూడా కలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా త్వరలోనే అసోసియేషన్‌ తరపున 'మా' భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు.

తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఈ ఏడాదే ప్రారంభమవుతుందని.. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందన్నారు. సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని.. నూతన నటీనటులు  సాంకేతిక సిబ్బందిని ప్రోత్సాహిస్తామని మంచు విష్ణు తెలిపారు. తనపై వచ్చే విమర్శలపై స్పందిస్తూ.. తనను విమర్శిస్తున్నారు అంటే పాపులర్ అయ్యానని అర్ధమని మంచు విష్ణు అన్నారు.

    
    
    

Tags:    

Similar News