టాలీవుడ్ కు పలు బ్లాక్ బస్టర్ ట్యూన్ లను అందించిన సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. `మెలోడి బ్రహ్మ`గా పాపులర్ అయిన మణి శర్మ కోసం గతంలో టాప్ హీరోలు క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ మణిశర్మ పాటలకు అభిమానులున్నారు. దాదాపు పది సంవత్సరాలపాటు టాలీవుడ్ లో చిరంజీవి - బాలయ్య - వెంకటేష్ - నాగార్జున - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - మహేష్ ఇలా స్టార్ హీరోలకు హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ....కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు యువ సంగీత దర్శకుల హవా నడుస్తుండడంతో మణిశర్మ కరిష్మా క్రమంగా తగ్గిపోయింది. అయితే, తాజాగా ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిశర్మ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ తో తనకు మనస్పర్థలు వచ్చాయని.....ఆయనను కలవాలని ప్రయత్నించినా కుదరలేదని మణిశర్మ అన్నారు.
మహేష్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎక్కువ సినిమాలకు తానే సంగీతం అందించానని, తమ మధ్య సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అయితే, తమ మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో మహేష్ భాదపడ్డాడని అన్నారు. అయితే, ఏ విషయంలో బాధపడ్డాడో తెలియదని, ఆ విషయం తెలుసుకునేందుకు మహేష్ ని కలవడానికి ప్రయత్నించినా కుదరలేదని అన్నారు. ఖలేజా - తీన్ మార్ - శక్తి లు మ్యూజికల్ హిట్స్ అని - అయినా ఆ హీరోలెవరూ తన వంక చూడలేదని అన్నారు. తాను ఇళయరాజా - రాజ్ -కోటి - కీరవాణిలను ఇప్పటికీ తన గురువులుగా భావిస్తానని, వారి నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అయితే, తన దగ్గర పనిచేసిన వారు తనను తిడుతున్నారని ఆవేదన చెందారు. తన దగ్గర పనిచేసినపుడు పర్ఫెక్షన్ కోసం తిట్టివుంటాననని, వ్యక్తిగతంగా వారిపై ద్వేషం లేదని చెప్పారు. బహుశా....ప్రతి చిన్న పనికి ఎక్కువ పర్ఫెక్షన్ కోరుకోవడం తన లోపం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.