ఈ జబ్బులు ఆపేస్తే బెటరేమో!!

Update: 2018-09-16 17:30 GMT
మన దర్శకులకు ఒక వీక్ నెస్ ఉంది. ఏదైనా ఒక థీమ్ తో మంచి విజయం సాధించినప్పుడు అందులో నుంచి బయటకు రాలేక పదే పదే ఆ లైన్ కే కట్టుబడి ఏదో పెద్ద దెబ్బ తగిలే దాకా తీస్తూనే ఉంటారు. అది ఇతరుల నుంచి స్ఫూర్తి పొందింది కావొచ్చు లేదా తమ సక్సెస్ నే చూసుకుని మూసలోకి వెళ్లిపోవడం కావొచ్చు. అప్పుడెప్పుడో శీను వైట్ల క్యారెక్టర్ స్వాపింగ్ (పాత్రల మార్పిడి)కాన్సెప్ట్ ద్వారా ఢీతో పిచ్చ కామెడీని పండిస్తే దాన్నే పట్టుకుని లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. చివరికి ఆ ఫార్ములానే రోత పుట్టేలా మారి శీను వైట్లతో సహా అందరికి చేదు ఫలితాలు మిగిల్చింది. ఇప్పుడు మారుతీ కూడా అదే తరహాలో ఆలోచించడాన్ని పలువురు వేలెత్తి చూపుతున్నారు. హీరోకు ఏదో ఒక బలహీనత లాంటి రోగం పెట్టి దాని చుట్టూ సన్నని కథను అల్లుకుని హాస్యంతో నడిపించేస్తున్న మారుతీ రాను రాను అదే రూట్ లో పదే పదే వెళ్లడం శైలజారెడ్డి అల్లుడులో కాస్త తేడా కొట్టించిందనే చెప్పాలి. వసూళ్లు ఎలా ఉన్నా సినిమా చాలా బాగుంది అనే యునానిమస్ టాక్ అయితే రాలేదు. ఇంకో మూడు రోజులు అయ్యాక క్లారిటీ వస్తుంది.

భలే భలే మగాడివోయ్ లో నానితో మతిమరుపు ఐడియా అద్భుతంగా వర్క్ అవుట్ చేసిన మారుతి ఆ తర్వాత వెంకటేష్ తో బాబు బంగారంలో చూపించిన అతి మంచితనం పేలలేదు. మహానుభావుడులో అతి శుభ్రత కొంత వరకు ఓకే అనిపించింది కానీ బెస్ట్ కాలేకపోయింది. ఇక తాను రచన చేసిన బ్రాండ్ బాబులో హీరోకి అతని తండ్రికి బ్రాండుల పిచ్చి పెట్టి మారుతీ ఖంగు తిన్నాడు. సరే ఎప్పుడు హీరోలకే పెడితే బాగుండదని ఫీల్ అయ్యి అతనొక్కడినే మంచోడిగా పెట్టేసి హీరోయిన్ తో పాటు ఆవిడ తల్లి ప్లస్ హీరో తండ్రి ఇలా ముగ్గురికి అవసరానికి మించి ఈగో జబ్బు పెట్టడం ఫైనల్ గా ఫలితం మీద బాగా ప్రభావం చూపించింది. సో మారుతీ ఇకపై పాత్రలకు జబ్బులు పెట్టడం లాంటివి కాకుండా కాస్త కొత్తగా ఆలోచించమని కోరుతున్నారు అభిమానులు. మరి మారుతీ జబ్బురహిత సినిమా వైపు వెళతాడో లేదో చూడాలి.
Tags:    

Similar News