మారుతి నిర్ణయం అభినందించదగినదే.. కానీ..?

Update: 2021-11-05 11:30 GMT
ఈ రోజుల్లో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 'బస్ స్టాప్' 'భలే భలే మగాడివోయ్' 'మహానుభావుడు' వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా కూడా తన ఖాతాలో పడాల్సిందే కానీ.. తన మీదున్న ముద్రను తొలగించుకోడానికి వేరే దర్శకుడి పేరు మీద రిలీజ్ చేశారు. చివరిగా 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సక్సెస్ అందుకున్న మారుతి.. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' అనే సినిమాని రూపొందించే పనిలో ఉన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ గ్యాప్ లో ''మంచి రోజులు వచ్చాయి'' అనే చిన్న చిత్రాన్ని తెరకెక్కించారు.

సంతోష్ శోభన్ - మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన 'మంచి రోజులు వచ్చాయి' సినిమా దీపావళి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మారుతి నుంచి ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వచ్చింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి. టేబుల్ ప్రాఫిట్ తో విడుదలైన ఈ మూవీకి లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది. కాకపోతే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం వల్ల దర్శకుడిగా మారుతి ఇమేజ్ కాస్త తగ్గే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు మరొక సినిమా చేయడం ఫిలిం మేకర్స్ కు అంత ఈజీ కాదు. అప్పటి తరం దర్శకులు చేశారు కానీ.. ఇప్పుడు ఎవరూ అలాంటి సాహసాలు చేయడం లేదు. నటీనటులు అంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ.. దర్శకులు సినిమా కథతో పాటుగా అన్ని విభాగాలను చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలను ఒకేసారి డీల్ చేయాలని అనుకోరు. రెండు మూడేళ్ళ సమయం పట్టినా.. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కు సిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు గోపీచంద్ వంటి స్టార్ తో సినిమా చేస్తున్న మారుతి.. 30 రోజుల గ్యాప్ లో ఒక చిన్న సినిమాని నెత్తికెత్తుకొని రిస్క్ చేసారని అంటున్నారు.

నిజానికి మారుతి ఒక సినిమా రన్నింగ్ లో ఉండగా మరో సినిమా చేయడం వల్ల ఎంతో మందికి పని దొరికింది. అది కూడా కరోనా పాండమిక్ సమయంలో ఎందరికో పని కల్పించిన మారుతి నిర్ణయం అభినందించదగినదే. కాకపోతే సినిమా ఫలితం అనేది దర్శకుడి ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి.. ఆయన కెరీర్ కు కాస్త ఇబ్బంది కలుగుతుంది. 'మంచి రోజులు వచ్చాయి' సినిమాని తన దర్శకత్వ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ తో చేయించాలని మారుతి భావించారట. అయితే అన్నీ బాగా కుదరడంతో సినిమా బాధ్యతను తనే తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ తదుపరి ప్రాజెక్ట్ 'పక్కా కమర్షియల్' మీద పడుతుందేమో అనే కామెంట్స్ విపిస్తున్నాయి. 'ప్రేమ కథా చిత్రమ్' తరహాలోనే మారుతి తెర వెనుక ఉండి ఈ చిత్రాన్ని నడిపిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి


Tags:    

Similar News