బ్లాక్ పాంథర్ 2 ట్రైలర్ : టెక్నాల‌జీ గ్లింప్స్ మ‌రో లెవ‌ల్లో!

Update: 2022-07-24 07:13 GMT
జేమ్స్ కామెరూన్ `అవ‌తార్` (2009) సంచ‌ల‌నాల గురించి ద‌శాబ్ధం పైగానే ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగింది. ఇప్ప‌టికీ దీనిపై చ‌ర్చించేందుకు సినీవిశ్లేష‌కులు ఆస‌క్తిగా ఉంటారు. దాదాపు ద‌శాబ్ధం త‌ర్వాత అంటే 2018లో `బ్లాక్ పాంథ‌ర్` సినిమా విడుద‌లైంది. అవ‌తార్ సాంకేతిక‌త‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో అంత‌కుమించి అనేలా అసాధార‌ణమైన సాంకేతిక‌త‌ను ఉప‌యోగించిన మూవీగా బ్లాక్ పాంథ‌ర్ గురించి విశ్లేష‌కులు చ‌ర్చించారు. ఈ మూవీ కోసం పండోరా త‌ర‌హాలోనే `వాకాండ` అనే ప్ర‌పంచాన్ని అధునాత‌న సాంకేతిక‌త‌తో సృష్టించిన తీరు వండ‌ర్ అనిపిస్తుంది. అందుకే బ్లాక్ పాంథ‌ర్ (2018) చిత్రానికి ప్ర‌త్యేకించి అభిమానులు ఏర్ప‌డ్డారు. నటించింది అంద‌రూ న‌ల్ల‌జాతీయులు.. గిరిజ‌న జాతీయులే అయినా కానీ వీళ్ల‌కు బోలెడంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

స‌రిగ్గా నాలుగేళ్ల‌కు బ్లాక్ పాంథ‌ర్ ఫ్రాంఛైజీ నుంచి రెండో సినిమా వ‌స్తోంది. `బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్`  మొదటి ట్రైలర్ కామిక్-కాన్ 2022లో విడుదలైంది. బ్లాక్ పాంథర్ చిత్రంలో కింగ్ టి -చల్లా పాత్ర పోషించిన నటుడు చాడ్విక్ బోస్ మాన్ మరణించిన తర్వాత సీక్వెల్ డైల‌మాలో ప‌డిపోయింద‌ని.. బోస్ మాన్ వారసత్వాన్ని ఎలా తీసుకువెళ‌తారో సందేహ‌మేన‌ని అభిమానులు క‌ల‌త చెందిన వేళ‌.. అన్నిటినీ తునాతున‌క‌లు చేస్తూ తాజా ట్రైల‌ర్ మ‌హ‌దాద్భుతంగా ఆవిష్కృత‌మైంది. సాంకేతిక‌త‌ను మ‌రో లెవ‌ల్లో స‌ద్వినియోగం చేసుకున్న సినిమా ఇద‌ని ఈ ట్రైల‌ర్ చెబుతోంది.

భారీత‌నం నిండిన విజువ‌ల్స్ టెక్నాల‌జీ గ్లింప్స్ మ‌హ‌దాద్భుతాన్ని చూపెడుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.  ఈ సిరీస్ కి ఉన్న ప్ర‌త్యేక‌త ఇత‌ర సూప‌ర్ హీరో సినిమాల‌తో పోలిక లేక‌పోవ‌డం. `బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్` సీక్వెల్ కొత్త ట్రైలర్ లో షురి (లెటిటియా రైట్)... క్వీన్ రమోండా (ఏంజెలా బాసెట్) వంటి `నో వుమన్ నో క్రై` అనే భయంకరమైన విజువ‌ల్ ప్ర‌దర్శనతో ప్రోమో ప్రారంభం కావడంతో బోస్ మన్ కింగ్ టి-చల్లా (మ‌ర‌ణించాడు) ఆత్మ‌ను కదిలిస్తూ అద్భుతంగా నివాళులర్పించింది చిత్ర‌బృందం. మ‌ర‌ణించిన రారాజు కోసం విచారించేవారిగా ఇక్క‌డ వాకాండ ప్ర‌జ‌లు క‌నిపించ‌డం మ‌రో స‌ర్ ప్రైజ్. ప్రోమో ఆద్యంతం అస‌లు చ‌ల్లా వార‌సుడు ఎవ‌రు? అన్న స‌స్సెన్స్ ని కొన‌సాగించింది. ఇందులో ఒక‌రిని మించిన వీరులు ఒక‌రు అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. చ‌ల్లాకు ధీటైన వీర‌త్వం ప్ర‌ద‌ర్శించే షురి లేదా ఇంకెవ‌రు హీరో? అనేదాని విష‌యంలో `బ్లాక్ పాంథ‌ర్` అభిమానులు సందిగ్ధంలో ప‌డ‌తార‌నే చెప్పాలి.

విలియమ్స్ అకా ఐరన్ హార్ట్ అకా రిరి విలియమ్స్ గా డొమినిక్ థోర్న్ ని... అలాగే నమోర్ గా టెనోచ్ హుర్టా క‌నిపించారు. ఈ రెండు కొత్త పాత్రలను కూడా ట్రైల‌ర్ లో పరిచయం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. బ్లాక్ పాంథర్ సీక్వెల్ కొత్త బ్లాక్ పాంథర్ కు పూర్తి ఆపోజిట్ గా నమోర్ పాత్ర‌ ను ఆవిష్క‌రిస్తున్న‌ట్టు కనిపిస్తోంది. వీడియో ఫుటేజీలో అట్లాంటియన్ యోధులు డోరా మిలాజేతో యుద్ధంలో నిమగ్నమై ఉండ‌డం సందేహాలు రేకెత్తిస్తోంది.

కామిక్-కాన్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ర్యాన్ కూగ్లర్ దివంగత నటుడు చాడ్విక్ బోస్ మాన్ గురించి మాట్లాడుతూ-``చాడ్ ఇప్పుడు భౌతికంగా మనతో లేడు.. కానీ అతని ఆత్మ.. అతని అభిరుచి.. అతని మేథోత‌నం.. అతని గర్వం... అతని సంస్కృతి.. అతను ఈ పరిశ్రమపై చూపిన ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. చాడ్విక్ పై మా ప్రేమను ఈ చిత్రంలో చూపించాం`` అని వ్యాఖ్యానించారు. బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ నవంబర్ 11న తెలుగు-ఇంగ్లీష్ స‌హా ప్రాంతీయ భాష‌ల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.


Full View
Tags:    

Similar News