మయూరి మూవీ రివ్యూ

Update: 2015-09-17 18:29 GMT
చిత్రం- మయూరి

నటీనటులు- నయనతార - అరి - లక్ష్మీప్రియ - రోబో శంకర్‌ - మైమ్‌ గోపీ - శరత్‌ - అమ్‌ జాత్‌ ఖాన్‌ తదితరులు
సంగీతం - రాన్‌ ఎథన్‌ యోహాన్‌
సినిమాటోగ్రఫీ - సత్యం సూర్యన్‌
నిర్మాత - సి.కళ్యాణ్‌
దర్శకత్వం - అశ్విన్‌ శరవనన్‌

ఓ వైపు టాప్‌ హీరోల సరసన నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్ లో నటిస్తూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది నయనతార. తమిళంలో 'మాయ' పేరుతో తెరకెక్కిన ఓ హార్రర్‌ డ్రామా చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించింది. ఇందులో గ్లామర్‌ పాత్ర కాకుండా.. ఓ బిడ్డకు తల్లిగా వుండే ఓ లోయర్‌ క్లాస్‌ మధ్య తరగతి యువతిగా నటించింది. ఈ సినిమా తెలుగులో 'మయూరి' పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో వినాయకచవితి సందర్భంగా విడుదలైంది ఈ మూవీ. మరి నయనతార మయూరిగా ఏమాత్రం ఆకట్టుకుందో  తెలుసుకుందామా!

కథ:

మయూరి(నయనతార) ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌. సినిమాలంటే ఇష్టపడే అర్జున్‌(అరి) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లైన మూణ్నెల్లకే మయూరి గర్భవతి అవుతుంది. అది అర్జున్‌కి ఇష్టం వుండదు. ఎందుకంటే.. మయూరిని సినిమాల్లో హీరోయిన్‌ గా లీడ్‌ రోల్స్‌ వేయించి నాలుగు డబ్బులు సంపాదించాలనేది అర్జున్‌ ఆలోచన. దాంతో మయూరిని అబార్షన్‌ చేయించుకోమంటాడు. అందుకు మయూరి నిరాకరించి భర్తతో విడిపోతుంది. ఇలా భార్యభర్తలిద్దరూ ఎవరికి వారు విడిపోయి జీవిస్తుంటారు. అయితే మయూరికి ఓ చిన్నపాప పుడుతుంది. చంటిపాప పోషణ బరువు అవుతుంది. కష్టాలు చుట్టుముడుతాయి. దాంతో ఆమె ఓ నిర్ణయానికి వస్తుంది. అదేంటంటే.. తన మిత్రురాలు స్వాతి(లక్ష్మీప్రియ), ఆమె స్నేహితులు కలిసి 'చీకటి' అనే ఓ హార్రర్‌ సినిమాను తెరకెక్కించి వుంటారు. ఆ సినిమాను ఎవరైతే భయపడకుండా చూస్తారో వారికి రూ.5లక్షలు బహుమతి ఇస్తున్నట్టు చెబుతుంది. అందుకు నయనతార ఒప్పుకుని సినిమాను చూడ్డానికి రెడీ అవుతుంది. ఆ సినిమాను చూసే క్రమంలోనే తను ఎవరు? ఆ సినిమాకు తనకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది మయూరికి తెలుస్తుంది. మరి ఆ సినిమాలో మయూరికి సంబంధించిన విషయాలు ఏమున్నాయనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

కథనం - విశ్లేషణ:

ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో చాలానే హార్రర్‌ డ్రామా స్టోరీలు వచ్చాయి. తెలుగులో హార్రర్‌ సినిమాలకు రామ్‌ గోపాల్‌ వర్మ పెట్టింది పేరు. అతను తీసినన్ని సినిమాలు తెలుగు టాప్‌ డైరెక్టర్లు ఎవరూ తీయలేదు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ ను తమిళంలో లారెన్స్‌ కొనసాగిస్తున్నాడు. వరుసగా ముని - కాంచన - గంగ ఇలా మూడు సినిమాలు తీసి హిట్లు కొట్టాడు. లారెన్స్‌ ఇన్స్‌ పిరేషన్‌ ని తీసుకున్నాడో ఏమో కొత్త డైరెక్టర్‌ అశ్విన్‌ శరవన్‌ కూడా ఓ ఫుల్‌ లెంగ్త్‌ హార్రర్‌ డ్రామా స్టోరీని ఎంచుకుని తెరకెక్కించాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ హార్రర్‌ బేస్డ్‌ మూవీని తీయాలనే ఉద్దేశంతో.. సినిమా ఫస్ట్‌ నిమిషం మొదలు కొని.. చివరి దాకా ఒకే బేస్‌ లో హార్రర్‌ తో ప్రేక్షకులను భయపెట్టేశాడు. ఇంతకు ముందు లారెన్స్‌ తీసిన సినిమాల్లో కాస్త కామెడీ అయినా వుండేది. ఇందులో అదేమీ లేకుండా పూర్తిస్థాయిలో ప్రేక్షకులు భయంతో కుర్చీకి అతుక్కుపోయేలా సినిమాను తెరకెక్కించాడు.

ఎంచుకున్న కథ కూడా హార్ట్‌ టచింగ్‌ వుండటంతో.. ఓ రకంగా ఇందులో దెయ్యంలా కనిపించే మాయా పట్ల ప్రేక్షకులకు కొంత సాఫ్ట్‌ కార్నర్‌ ఉంటూనే.. భయపడేస్తూ వుంటారు. అలా సినిమాను ఆద్యంతం క్యారీ చేయడంలో దర్శకుడు వందశాతం విజయం సాధించాడు. చివర్లో ఓ పది నిమిషాలు కథను డ్రాగ్‌ చేసినట్లు అనిపించినా.. ఓవర్‌ ఆల్‌ గా ప్రేక్షకులు ఓ మంచి హార్రర్‌ మూవీ చూశాం అనే భావంతోనే థియేటర్‌ నుంచి భయటకు వస్తారు.

ఇందులో రెండు ప్రేమకథను అల్లుకుని దర్శకుడు మంచి పని చేశాడు. అందులో ఒకటి మయూరి తల్లి మాయా మాథ్యూస్‌ ది. మరొకటి మయూరిది. మాయా మాథ్యూస్‌ ఇందులో చివరి వరకు ఎవరనేది రివీల్‌ చేయకపోయినా.. ఆమె స్టోరీ వింటే మాత్రం ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుంది. మాయా మాథ్యూస్‌ అనే ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వారి మొదటి యాన్నివర్శరీ రోజుకి ఆమె గర్భవతి అయివుంటుంది. అదే రోజు తన భర్తకు ఓ లవర్‌ వుందని తెలుస్తుంది. అయితే అదే రోజు.. తన భర్త మరణిస్తాడు. అతని మరణానికి కారణం మాయా మాథ్యూస్‌ కారణమని ఆమెను తీసుకెళ్లి మాయావనంలో వున్న అసైలం అనే మానసిక వికలాంగులు వుండే చోట వుంచుతారు. అయితే అక్కడ కొంత మంది వీరిపై కొత్త కొత్త డ్రగ్స్‌ ను ప్రయోగిస్తూ.. జంతువుల కంటే హీనంగా చూస్తుంటారు. మాయా ఒక బిడ్డకు తల్లి అవుతుంది. అయితే ఆ బిడ్డను అక్కడ డ్రగ్స్‌ ప్రయోగించే కొందరు వ్యక్తులు ఆమె నుంచి దూరం చేస్తారు. కన్నబిడ్డ దూరం కావడంతో ఆమె మతిస్థిమితం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె చేతికి ఓ వజ్రాల వుంగరం వుంటుంది. ఆ వుంగరం ఏమైందనే ప్రధానాంశంతోనే సినిమా కథను నడిపించాడు దర్శకుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌ గా వుంటుంది.

కథను నడిపించిన స్క్రీన్‌ ప్లే అయితే బాగుంది కానీ.. కథలోనే కొంత క్లారిటీ కొరవడింది. కొన్ని క్యారెక్టర్ లను అనవసరంగా చొప్పించి.. ఆ పాత్రలకు జెస్టిఫికేషన్‌ ఇవ్వకుండా ముగించేశాడు. ఇందులో మయూరి భర్త అర్జున్‌ మరో పాత్రలో వసంత్‌ గా కూడా కనిపిస్తాడు. ఇది కొంత కన్‌ ఫ్యూజన్‌ కలిగిస్తుంది. చివరి వరకు మయూరి భర్త ఎవరనేది సస్పెన్స్‌ కొనసాగించి.. చివరకు అర్జున్‌ యే మయూరి భర్త అనేలా రివర్స్‌ స్క్రీన్‌ ప్లే చేసి చూపించడం అంత కన్వెన్సింగ్‌ గా అనిపించదు. రామ్‌ అనే వ్యక్తి తన మిత్రురాలు కేథరిన్‌ తో కలిసి మాయా వనంలో ఉంగరం కోసం సమాధులు తవ్వేటప్పుడు ఉంగరం లేదు.. నిర్మాత వద్ద వుంది. ఆ విషయం నాకు దర్శకుడు ఆర్కే చెప్పాడని చెబుతాడు. అయినా రామ్‌ అనే వ్యక్తి వజ్రాల వుంగరం కోసం తవ్వుతూనే ఉంటాడు. ఈ సీన్‌ కూడా అంతగా కనెక్ట్‌ కాదు. అలాగే క్లైమాక్స్‌ లో మయూరి, అర్జున్‌ పరుగెత్తుకుంటూ పోతూ.. ఓ పెద్ద క్యాటిల్‌ ట్రాప్‌ గుంటలో పడిపోతారు. అక్కడ కూడా వీరిద్దరికీ ఏమీ సంబంధం లేనట్టు చూపించాడు. అలాగే థియేటర్ లో మయూరి సినిమా చూస్తున్నప్పుడు ఆమె తల్లి మాయా దెయ్యం రూపంలో వచ్చి ఆమె కళ్లను మూసిపెడుతుంది. అయితే అక్కడే తన వుంగరాన్ని ధరించి వున్న 'చీకటి' చిత్ర దర్శకుడిని మాత్రం వదిలేసి వెళుతుంది. ఎప్పుడో క్లైమాక్స్‌ లో అతన్ని చంపేస్తుంది. క్లైమాక్స్‌ అంతా కొంచెం డ్రాగ్‌ చేసినట్టే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌ లో సినిమా కొంచెం స్లో అయ్యి మొదటి నుంచి మెయింటైన్‌ చేసిన టెంపోకి బ్రేక్‌ వేసినట్టవుతుంది. ప్రీ క్లైమాక్స్‌ లో ఉంగరం కోసం తవ్వే సీన్‌ చూపిస్తే .. ఉంగరం కోసమే లేని దెయ్యాలు వున్నాయనే అపోహలు సృష్టించి అక్కడికి ఎవరు రాకుండా చేస్తూ.. ఒక వేళ ధైర్యం చేసి వచ్చిన వారిని వీరే చంపేస్తున్నారేమో అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మినహా సినిమా ఆద్యంతం ఆడియన్స్‌ ను భయపెట్టించేస్తుంది. ఇందులో దర్శకుడి ప్రతిభే ఎక్కువగా వుంది.

నటీనటులు:

నయనతార ఓ మధ్యతరగతి యువతిగా బాగా నటించింది. ఆమె హావ భావాలు సైతం అలాగే వుంటాయి. నటనకు ప్రాధాన్యం వున్న సినిమా కాబట్టి.. ఇందులో మాగ్జిమమ్‌ తన ప్రతిభను కనబరచింది. ఓ బిడ్డకు తల్లిగా ఎలా వుండాలో అలా తన మేకేవోర్‌ చేయించుకుంది. ఇందులో మరో చెప్పుకోదగ్గ క్యారెక్టర్‌ ఏదైనా ఉందా అంటే... అది నయనతారా స్నేహితురాలిగా నటించిన లక్ష్మీప్రియ క్యారెక్టర్‌ ఆమె కూడా చాలా నాచురల్‌ గా నటించింది. ఆపదలో వుండే స్నేహితురాలిగా చాలా క్యాజువల్‌ గా నటించింది. తనకు ప్రాణ సమానమైన స్నేహితురాలు ఆపదలో వుంటే ఎలాంటి భావాలు పలికిస్తారో అలాంటి భావాలు చాలా చోట్లనే పలికించింది. ముఖ్యంగా మయూరి సినిమాను చూడటానికి థియేటర్ లో కూర్చునప్పుడు ఆమె చూపించిన ఆప్యాయత చాలా కన్వెన్సింగ్‌ గా వుంది. ఇందులో దర్శకుడి పాత్రలో నటించిన మైమ్‌ గోపీ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్‌ వుంది. అతడు కూడా దర్శకుడికి ఎలాంటి లక్షణాలుంటాయో అలాంటి లక్షణాలను తన నటనతో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా చివర్లో చాలా బాగా నటించాడు. అలాగే మొదట్లో నయనతారతో చేయించే యాక్టింగ్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది.

సాంకేతిక నిపుణులు:

ఈ సినిమాకు ప్లస్‌ ఏంటంటే.. దర్శకుడు ఎంచుకున్న కథ. ఇందులో స్థూలంగా చూస్తే రెండు కథలు ప్యార్‌ లల్‌ గా ప్రయాణం చేస్తూ వుంటాయి. సూక్ష్మంగా చూస్తే.. నాలుగు కథలు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. వాటన్నింటినీ సింక్‌ చేయడంలో కాస్త తడబడినా.. చివరకు ఆడియన్స్‌ ను మాత్రం భయపెట్టేలా సినిమా తీసి సక్సెస్‌ అయ్యాడు. చివర్లో వచ్చే కొన్ని దెయ్యాలు మరి భయపెట్టేసే విధంగా చూపించాడు. దాంతో చిన్నపిల్లలు జడుసుకునే ప్రమాదమూ లేకపోలేదు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉపయోగపడింది. నైట్‌ ఎఫెక్ట్‌ లో చాలా భాగం షూట్‌ చేశారు. అందులో రెండు వేరియేషన్స్‌ ను చూపించాడు. ఒక చోట బ్లాక్‌ అండ్‌ వైట్‌.. మరో చోట కలర్‌. చాలా రిచ్‌ క్వాలిటీతో సినిమాను తెరకెక్కించాడు. సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. భయపెట్టే చోట బాగా భయపెట్టేశాడు తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తో. ఎడిటింగ్‌ మొదటి హాఫ్‌.. ఆ తరువాత ఓ అరగంట బాగుంది. క్లైమాక్స్‌ ను కొంత ట్రిమ్‌ చేసుంటే బాగుండేది. సెకెండాఫ్‌ డ్రాగ్‌ లేకుండా వుండేలా తన కత్తెరకు పని చెప్పింటే.. సినిమా మరింత గ్రిప్పింగ్‌ గా వుండేది.

చివరగా...  మయూరి బాగా భయపెట్టేస్తుంది. కాస్త ధైర్యం చేసుకుని సినిమాకు వెళ్లండి.

రేటింగ్: 2.75/5


#Mayuri, #Mayurireview, #NayantharaMayuri, #Mayuritalk, #MayuriRating, #Nayantharamayurireview

Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre
Tags:    

Similar News