భయపెట్టి డబ్బులు దండుకుంటున్న నిర్మాత

Update: 2015-09-23 09:54 GMT
అవును.. సి.కళ్యాణ్ భయపెట్టి భయపెట్టే డబ్బులు దండుకుంటున్నాడు. అలాగని ఆయనేమైనా దందాలు చేస్తున్నాడేమో అనుకోకండి. ఆయన భయపెడుతోంది ప్రేక్షకుల్నే. వరుసగా హార్రర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని వణికించి.. కాసుల పంట పండించుకుంటున్నాడు కళ్యాణ్. ఇంతకుముందు హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఆరణ్మయిని ‘చంద్రకళ’ పేరుతో తెలుగులో రిలీజ్ చేసి ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు కళ్యాణ్. ఆ తర్వాత ‘పిశాచి’ ఆయనకు మంచి ఫలితాన్నించింది. ఆ సినిమా మంచి వసూళ్లు సాధించడమే కాదు.. శాటిలైట్ ద్వారా కూడా బాగానే సంపాదించి పెట్టింది.

తాజాగా సి.కళ్యాణ్ బేనర్ నుంచి వచ్చిన ‘మయూరి’ కూడా ఆయనకు ప్రాఫిటబుల్ ప్రాజెక్టు అయింది. థియేట్రికల్ కలెక్షన్లతోనే పెట్టుబడి రాబట్టుకున్న కళ్యాణ్.. శాటిలైట్ తో బాగానే ఆర్జించినట్లు సమాచారం. ప్రముఖ ఛానెల్ జెమిని టీవీ ఫ్యాన్సీ రేటిచ్చి ‘మయూరి’ శాటిలైట్ రైట్స్ తీసుకన్నట్లు తెలిసింది. మొత్తానికి కళ్యాణ్ ‘మయూరి’ మీద పెట్టిన మొత్తానికి రెట్టింపు రాబట్టుకున్నట్లు చెబుతున్నారు. తమిళంలో మాయ పేరుతో విడుదలైన ‘మయూరి’కి అక్కడా ఇక్కడా మంచి టాక్ వచ్చింది. ఇండియాలో వచ్చిన అరుదైన హార్రర్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. నయనతార ప్రధాన పాత్రలో 24 ఏళ్ల కొత్త దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించిన ‘మయూరి’కి హాలీవుడ్ హార్రర్ సినిమాల స్పెషలిస్టు ఎరిక్ ఇంగ్లాండ్ ప్రశంసలు అందించడం విశేషం.
Tags:    

Similar News