ఆనాటి చిరూ జోడీలకు మెగా బ్రేక్!

Update: 2022-07-20 03:30 GMT
చిరంజీవి మంచి స్నేహశీలి అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ప్రతి ఒక్కరితోను స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ జాబితాలో నిన్నటితరం కథానాయికలు కూడా ఉండటం విశేషం.

చిరంజీవితో అప్పట్లో ఎక్కువ సినిమాలు చేసిన నాయికలుగా విజయశాంతి .. రాధ .. భానుప్రియ .. రాధిక .. సుహాసిని  .. సుమలత ఇలా చాలామంది  కనిపిస్తారు. వాళ్లందరితోను చిరంజీవి చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. ఏదైనా పార్టీలో వాళ్లంతా కలిస్తే  అక్కడి వాతావరణమే సందడిగా మారిపోతుంది.

చిరంజీవి సరసన కథానాయికలుగా చేసిన వారిలో విజయశాంతి .. రాధ .. సుమలత .. శోభన నలుగురూ కూడా సినిమాలు చేయడం మానేసి చాలాకాలమైంది. ఇక భానుప్రియ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. రాధిక విషయానికి వస్తే సీరియల్స్ పైనే ఆమె ఎక్కువగా ఫోకస్ చేసింది. సుహాసిని .. రమ్యకృష్ణ మాత్రం అడపా దడపా తెరపై కనిపిస్తున్నారు. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఆనతి ఆయన స్నేహ బృందంలో ఖుష్బూ .. రంభ తదితరులు కనిపిస్తుంటారు.

వివిధ కారణాల వలన తెలుగు తెరకి దూరమైన సీనియర్ హీరోయిన్లను తిరిగి తెలుగు తెరకి తీసుకురావాలనే ఒక ఆలోచనలో మెగాస్టార్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తన సినిమాల్లో కీలకమైన పాత్రల ద్వారా వాళ్లకి తిరిగి బ్రేక్ ఇవ్వడానికి ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఆయన 'గాడ్ ఫాదర్' సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం శోభనను సిఫార్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమె అందుబాటులో లేని కారణంగానో ఏమో ఆ ఛాన్స్ నయనతారకి వెళ్లిందని అంటారు.

ఇక ఇప్పుడు ఆయన బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య' చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన తల్లి పాత్ర కోసం 'సుమలత'ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో సుమలత చేస్తున్న సినిమా ఇది.

తాను చేస్తున్న మిగతా సినిమాల్లోను ఆనాటి కథానాయికలకు కీలక పాత్రలను కేటాయించడమే కాకుండా .. వాళ్లకు అవకాశం ఇవ్వమని కూడా మిగతా మేకర్స్ కి చిరంజీవి చెబుతున్నట్టుగా టాక్. సీనియర్ హీరోయిన్లను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వాళ్లకి మెగా బ్రేక్ ఇచ్చే ప్రయత్నంలో మెగాస్టార్ ఉండటం ప్రశంసనీయం. 
Tags:    

Similar News