రీమేకులతో కాదు.. మంచి కంటెంట్ తో రావాలి బాసూ..!

Update: 2022-08-06 05:52 GMT
టాలీవుడ్ కు నూతనోత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ మధ్య తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న తరుణంలో.. నిన్న ఒకే రోజు రిలీజైన రెండు చిత్రాలు హిట్ టాక్ రాబట్టి ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' & దుల్కర్ సల్మాన్ 'సీతారామం' సినిమాలు శుక్రవారం (ఆగస్ట్ 5) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యాయి. తొలి ఆట నుంచే ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడం విశేషం. సోసియో ఫాంటసీ యాక్షన్ అంశాలతో ఓ సినిమా మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మ్యాజికల్ లవ్‌ స్టోరీతో మరొకటి క్లాస్ ఆడియన్స్ ను మెప్పించింది.

ఇలా రెండు సినిమాలు విజయాలు సాధించడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందాలకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా 'సీతారామం' మరియు 'బింబిసార' మేకర్స్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

''ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా 'సీతారామం' మరియు 'బింబిసార' చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు'' అని చిరు పేర్కొన్నారు.

అయితే చిరంజీవి ట్వీట్ కు స్పందించిన పలువురు నెటిజన్లు.. మీరు కూడా మంచి కంటెంట్ తో రావాలని సూచిస్తున్నారు. రీమేక్ చిత్రాలతో కాకుండా ఒరిజినల్ కంటెంట్ తో మెప్పించాలని కోరుతున్నారు. అభిమానులు ఇలాంటి కామెంట్స్ పెట్టడానికి కారణం ఇటీవల కాలంలో చిరు భారీ డిజాస్టర్ అందుకోవడం.. రెండు రీమేక్ చిత్రాలు చేస్తుండటమే అని తెలుస్తోంది.

చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత స్పీడ్‌ గా క‌థ‌ల‌ను ఓకే చేస్తూ.. సెట్స్‌ పైకి తీసుకెళ్తున్నారు. ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మెగాస్టార్ రేంజ్ కు తగ్గ కంటెంట్ తో రావడం లేదని మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి ఇటీవల 'ఆచార్య' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. సాదారణ ప్రేక్ష‌కుల‌నే కాదు మెగా ఆభిమానుల‌ను సైతం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అందుకే ఇది మెగా హీరోల కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇకపోతే చిరు ప్ర‌స్తుతం మోహ‌న్‌ రాజా ద‌ర్శ‌క‌త్వంలో 'గాడ్‌ ఫాద‌ర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుద‌ల కాబోతోంది. ఇది మలయాళంలో సక్సెస్ అయిన 'లూసిఫర్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో దీని తెలుగు వెర్సన్ కూడా అందుబాటులో ఉంది. అలాంటి చిత్రాన్ని మెగా బాస్ రీమేక్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అలానే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'భోళా శంక‌ర్' అనే సినిమా చేస్తున్నారు చిరు. ఇది తమిళ్ హిట్ అయిన 'వేదాళం' చిత్రానికి అఫిషియల్ రీమేక్. ఇది ఫ్రెష్ కంటెంట్ ఏమీ కాదు. 2015లో వచ్చిన రొటీన్ మాస్ మసాలా యాక్షన్ మూవీ. యూట్యూబ్ లో ఈపాటికే అందరూ చూసేశారు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత చిరంజీవి ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అందుకే సరికొత్త కంటెంట్ తో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే రీమేక్ కథల్లో తగినన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా చిత్ర బృందాలు చెబుతున్నారు. మరి వీటితో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇకపోతే బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా చేస్తున్న చిరు.. వెంకీ కుడుముల - మారుతి లతో ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు.
Tags:    

Similar News