చరణ్ స్పెషాలిటీ అదే .. 15 సినిమాలలోపే 50 సినిమాల క్రేజ్!

Update: 2022-03-27 04:31 GMT
వెండితెరపై  హీరోగా కనిపించడం .. మెప్పించడం .. స్టార్ స్టేటస్ ను అందుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఒక వైపున బలమైన సినిమా నేపథ్యం కలిగిన  కుటుంబాల నుంచి వారసులు వస్తుంటారు. మరో వైపున బలమైన పట్టుదలతో అనుకున్నది సాధించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చేవారుంటారు. ఈ రెండు వరసల్లో చరణ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చరణ్ కి అవకాశం ఉంది కనుక, ఎలాంటి కష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చాడు .. ఆయన వెనుక బలమైన   నేపథ్యం ఉంది గనుక భారీ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడని అనుకుంటారు.

కానీ ఇక్కడ ఎంతటి బలమైన నేపథ్యం ఉన్నప్పటికీ, విషయం ఉన్నవారే నిలబడతారు. వారసుల నేపథ్యం ఎంట్రీ వరకూ మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్లలో టాలెంట్ లేకపోయినా ప్రోత్సహించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఉత్సాహాన్ని చూపించరు. బయట నుంచి ఇండస్ట్రీకి వచ్చినవారిపై పెద్దగా అంచనాలు ఉండవు గనుక, తమని తాము మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి ప్రేక్షకులు కాస్త సమయం ఇస్తారు. అదే వారసుల విషయానికి వస్తే మాత్రం  భారీగా అంచనాలను పెంచుకుని, అందుకు ఏ మాత్రం తగ్గినా పక్కన పెట్టేస్తారు.

తెలుగు తెరపై మెగాస్టార్ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాంటి ఆయన నట  వారసుడిగా చరణ్ పై ఎంతో ఒత్తిడి ఉంటుంది. చిరంజీవిని ఎంతమాత్రం అనుకరించకుండా తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకోవడం, తన డాన్సులు .. ఫైట్లు  ఆయన ముద్రకి దగ్గరగా లేకుండా చూసుకోవడం అనుకున్నంత తేలికకాదు. అలాంటి పరీక్షలను దాటుకుంటూ చరణ్ ఎదుగుతూ వచ్చాడు. లవ్  .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇలా అన్నింటిపై తనదైన మార్కు చూపిస్తూ .. అన్నివర్గాల  ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వెళుతున్నాడు.

కథ నేపథ్యం ఏదైనా పాత్రలో ఒదిగిపోవడం .. ఆ పాత్రలను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లడంలో చరణ్ సక్సెస్ అయ్యాడు. ఎప్పటికప్పుడు క్రొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ .. వైవిధ్యభరితమైన పాత్రలతో తనని తాను నిరూపించుకుంటూ .. అభిమానుల  మనసులను గెలుచుకుంటూ వెళుతున్నాడు. ఆయన నటనకు కొలమానంగా నిలిచే సినిమాలలో  'మగధీర' .. 'నాయక్' .. 'ఎవడు' .. 'ధ్రువ' .. 'రంగస్థలం' .. వంటి సినిమాలు కనిపిస్తాయి. తాజాగా  'ఆర్ ఆర్ ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న చరణ్, ఆ తరువాత సినిమాను శంకర్  దర్శకత్వంలో చేస్తున్నాడు.

దిల్ రాజు బ్యానర్ పై వస్తున్న 50వ సినిమా ఇది. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా. క్రేజ్ పరంగా చూసుకుంటే చరణ్ ఇప్పటికే చాలా దూరం వచ్చేశాడు. ఈ రోజున చరణ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్  ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చరణ్ చాలా డిఫరెంట్ గా .. డీసెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక మెగాస్టార్ తో కలిసి చరణ్ నటించిన 'ఆచార్య' వచ్చేనెల 29న రానున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News