ప్రకాశ్‌ రాజ్‌ మరో సంచలన ట్వీట్‌!

ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సైతం స్పందించారు.

Update: 2024-10-02 11:01 GMT

తిరుమల లడ్డూ వ్యవహారం దేశ స్థాయిలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలే కాకుండా సెలబ్రిటీలు, పీఠాధిపతులు, హిందూ సంఘాలు, సాధారణ భక్తులు, నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సైతం స్పందించారు. ఆయన గత కొన్ని రోజులుగా వరుసగా సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టులు చేస్తున్నారు. కొన్ని పోస్టులు పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి ఉన్నాయని టాక్‌ నడుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ సైతం లడ్డూ గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడొద్దని ప్రకాశ్‌ రాజ్‌ కు సూచించారు. దీనికి ప్రకాశ్‌ రాజ్‌ కూడా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్‌ విదేశాల్లో ఉన్నానని.. విదేశాల నుంచి వచ్చాక దీనిపై మిమ్మల్ని కలిసి వివరణ ఇస్తానని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

అంతేకాకుండా సనాతన ధర్మం, దేవుడు, లడ్డూ తదితర అంశాలపై ప్రకాష్‌ రాజ్‌ వరుస పోస్టులు పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపైన కూడా ఆయన స్పందించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి తాజాగా ఎక్స్‌ లో స్పందించారు. మహాత్మాగాంధీ, దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జన్మదినోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్‌ 2న ఎక్స్‌ లో పోస్టు చేశారు. వారి ఇద్దరి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశ్‌ రాజ్‌.. గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి కోట్‌ లను ఈ సందర్భంగా పోస్టు చేశారు. వారిద్దరి వ్యాఖ్యలు ఇప్పుడు మనందరికి అవసరమని తెలిపారు.

‘మీరు మైనారిటీగా ఉన్నా నిజమనేది ఎప్పటికీ మారదు. నిజంగా నిజంగానే ఉంటుంది’ అని గాంధీజీ పలికిన ఒక కొటేషన్‌ ను ప్రకాష్‌ రాజ్‌ పోస్టు చేశారు.

అలాగే.. ‘గురుద్వారాలు, మసీదులు, దేవాలయాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాం. ఇదే మనకు, పాకిస్థాన్‌ కు ఉన్న తేడా’ అని లాల్‌ బహదూర్‌ శాస్త్రి చెప్పిన విషయాన్ని కూడా ప్రకాశ్‌ రాజ్‌ పోస్టు చేశారు.

గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి గతంలో చెప్పిన ఈ రెండు విషయాలు మనకు సూటవుతాయని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం వంటి విషయాలు హాట్‌ టాపిక్‌ గా మారిన వేళ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags:    

Similar News