లాక్ డౌన్ లో కూడా రక్తదానం చేయడం ఆపొద్దు: మెగాస్టార్

Update: 2020-04-19 12:56 GMT
కరోనా వైరస్ విషయంలో చిరంజీవి ముందు నుంచి స్పందిస్తూనే ఉన్నారు. కరోనాపై తన వంతుగా ప్రజలకు అభిమానులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా సినీ కార్మికుల కోసం లాక్ డౌన్ వేళ అండగా ఉండేందుకు ఛారిటీని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా మెగాస్టార్ దేశంలో రక్త నిల్వలు తగ్గుతున్నాయన్న విషయంపై కూడా స్పందించారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు అభిమానులు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని అందుకు స‌మీప బ్ల‌డ్ బ్యాంక్స్‌కి వెళ్లాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తనవంతుగా బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. ముఖానికి మాస్క్ తగిలించుకొని తన ఇంటికి సమీపంలో జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌ కి వెళ్లి ర‌క్త‌దానం ఇచ్చారు. చిరంజీవితో పాటు హీరో శ్రీ‌కాంత్ - రోష‌న్ - శ్రీ‌మిత్ర చౌద‌రి.. వారి వార‌సులు తేజ్ నివాస్ - తేజ్ గోవింద్ - బెన‌ర్జీ - నటుడు భూపాల్ - గోవింద‌రావు - విజ‌య్ - సురేష్ కొండేటి త‌దిత‌రులు ర‌క్త‌దానం చేసిన వారిలో ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'లాక్‌ డౌన్ వేళ ర‌క్త దాత‌ల సంఖ్య బాగా త‌గ్గింది. ర‌క్తం ఇచ్చేవారు లేక‌ కొర‌త ఎక్కువ‌గా ఉంది. పేషెంట్స్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌ల‌సేమియా-క్యాన్సర్ వ్యాధిగ్ర‌స్తులు.. బైపాస్ స‌ర్జ‌రీ - హార్ట్ రోగులు.. ప్ర‌మాదాల‌కు గురైన వారు.. ఎనీమియా వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ర‌క్తం లేక ఇబ్బంది ప‌డుతున్న వారిని ఆదుకునేందుకు ప్ర‌జ‌లు అభిమానులు ముందుకు రావాలి. స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేస్తే ప్రాణ‌దానం చేసిన‌వారు అవుతారు. త‌మ్ముడు శ్రీ‌కాంత్.. మిత్రుడు శ్రీ‌మిత్ర చౌద‌రి.. వారి స్నేహితులు వ‌చ్చి ర‌క్త‌దానం ఇచ్చి స్ఫూర్తి నింపారు. దీనిని ఇన్‌ స్పిరేష‌న్‌ గా తీసుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు ర‌క్త‌దానం చేయాల‌ని కోరుతున్నాను. లాక్‌డౌన్ ఉన్నా ర‌క్త‌దానం చేయొద్ద‌ని ఎవ‌రూ ఆప‌రు. బ‌య‌ట పోలీసుల వ‌ల్ల ఏ ఇబ్బందీ త‌లెత్త‌దు. ర‌క్త‌దానం చేస్తున్నాం అని తెల‌ప‌గానే బ్ల‌డ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్‌ కు పాస్ వ‌స్తుంది. అది పోలీసుల‌కు చూపిస్తే స‌రిపోతుంది’ అని తెలిపారు. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట సమయంలో మెగాస్టార్ స్పందిస్తున్న తీరుకి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.




Tags:    

Similar News