కృష్ణ ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు చిరు?

Update: 2022-06-05 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయ‌న న‌ట‌న మ్యాన‌రిజ‌మ్స్ డ్యాన్సులకు ప్ర‌త్యేకించి అభిమానులున్నారు. 90ల‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమా సుప్రీంగా స‌త్తా చాటి అనంత‌ర కాలంలోనూ మెగాస్టార్ గా ద‌శాబ్ధాల పాటు హ‌వా సాగిస్తూనే ఉన్నారు. 150 పైగా చిత్రాల్లో ఆయ‌న న‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశ విదేశాల్లో చిరుకి వంద‌లాది ఫ్యాన్స్ అసోసియేష‌న్లు ఉన్నాయి. నిరంత‌రం ర‌క్త దానాలు క‌ళ్ల దానాలు అంటూ సామాజిక కార్య‌క్ర‌మాల‌కు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు.

అయితే చిరంజీవికి ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ని అసోసియేష‌న్లు ఉన్నాయి. కానీ ఆయ‌న ఎవ‌రికి అభిమాని? ఏ హీరోని ఎక్కువగా అభిమానించారు? ఏదైనా ఫ్యాన్స్ అసోసియేష‌న్ లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారా? అన్న‌దానికి తాజాగా ఒక‌ ఫోటో ఆధారం ల‌భించింది. కోట్లాది మంది అభిమానులు త‌న‌కు ఉన్నా కానీ తాను ఒక ప్ర‌ముఖ హీరోకి అభిమానిని అని నిరూపిస్తూ ఈ ఆధారం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

మెగాస్టార్ చిరంజీవి `ప‌ద్మాల‌య కృష్ణ ఫ్యాన్స్` అసోసియేష‌న్ కి అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. ఆయ‌న‌ను గౌర‌వ అధ్య‌క్షుడు అంటూ సంబోధిస్తూ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ ఒక క‌ర‌ప‌త్రాన్ని ముద్రించింది. నాటి ఆ క‌ర‌ప‌త్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది. అప్ప‌ట్లో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేష‌న్ కి ప్రేమ్ దాస్ అధ్య‌క్షుడు కాగా న‌టుడు అయిన చిరంజీవిని గౌర‌వ అధ్య‌క్షుడిగా కొన‌సాగించారు. నిజానికి అదే క‌ర‌ప‌త్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌- చిరంజీవి క‌లిసి న‌టించిన `తోడు దొంగ‌లు.. అతి త్వ‌ర‌లో వ‌స్తున్నారు` అంటూ టైటిల్ ని కూడా ముద్రించారు.

నిజానికి కృష్ణ గారంటే చిరుకి ఎంతో గౌర‌వం అభిమానం. ఇప్ప‌టికీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అంతే గొప్ప సాన్నిహిత్యం ఉంది. నాటి రోజుల్లో కృష్ణ ఏం చేసినా రెబ‌ల్ గా ఉండేది. టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేయ‌డంలో నిర్మాత‌గా ప్ర‌యోగాలు చేయ‌డంలో.. హీరోగా తెర‌పై రెబ‌ల్ గా క‌నిపించ‌డంలో ఆయ‌న‌ తీరు ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగించేవి. ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)కి పెద్ద‌గా సూప‌ర్ స్టార్ సేవ‌లందిస్తున్నారు. చిరు కూడా ఆయ‌న‌తో పాటు ఒక పెద్ద‌గా కొన‌సాగుతూ పెద్ద‌ల అడుగు జాడ‌ల‌ను అనుస‌రిస్తున్నారు. ఆ విన‌యం విన‌మ్ర‌త త‌న‌ని ఇంత‌టి వాడిని చేసాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News