కూతురి కోసం నిర్మాతగా మారిన హీరోయిన్ తల్లి..!

Update: 2022-02-16 00:30 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో పాటుగా వారి తల్లులకు కూడా భాగం ఉంటుంది. ఎందుకంటే షూటింగ్ సమయంలో ఎక్కువ శాతం సెట్స్‌ లో హీరోయిన్లతో పాటుగా వాళ్ళు కూడా కనిపిస్తుంటారు.

కుమార్తెతో పాటుగా ఉంటూ వారి జాగ్రత్తలను చూసుకుంటూ ఉంటారు. అలానే వారి షూటింగ్ షెడ్యూల్స్ ను పర్యవేక్షిస్తుంటారు. అయితే కొందరు హీరోయిన్ల తల్లులు ప్రొడక్షన్ లోకి దిగి సినిమాలను కూడా నిర్మిస్తుంటారు.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా అప్పట్లో పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తన కుమార్తెతో కలిసి కొన్ని చిత్రాలను ప్రొడ్యూస్ చేసింది.

అలానే మహానటి కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ 'రేవతి కళామందిర్' అనే బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తుంటారు. ఇప్పుడు కీర్తి - టొవినో థామస్ హీరోహీరోయిన్లుగా 'వాశి' అనే మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ కూడా నిర్మాతగా మారుతున్నారు.

'లై' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ మేఘా ఆకాష్.. తన అందం అభినయం క్యూట్ నెస్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'రాజ రాజ చోర' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల 'డియర్ మేఘ' సినిమాతో పలకరించింది.

 ప్రస్తుతం 'మను చరిత్ర' 'గుర్తుందా శీతాకాలం' వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న మేఘ.. తన తల్లి నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయింది.

అభిమన్యు బద్ది దర్శకత్వంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా ఓ అందమైన ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. బిందు ఆకాష్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించనున్నారు.

'డియర్ మేఘ' దర్శకుడు సుశాంత్‌ రెడ్డి ఈ సినిమాకు కథ అందించడమే కాదు.. ట్రిప్పీఫ్లిక్స్ స్టూడియోస్ మరియు కోట ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై అభిషేక్ కోట - బిందు ఆకాష్‌ లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌ మెంట్ పోస్టర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. హరి గౌర ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.

త్వరలో ఈ మూవీ షూటింగ్‌ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో నటించే మిగతా నటీనటుల గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తల్లీ కూతుర్లు బిందు ఆకాష్ - మేఘా ఆకాష్ లకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News