మినీ రివ్యూ: '9 అవర్స్'

Update: 2022-06-06 05:29 GMT
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓవైపు సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 'హరి హరా వీరమల్లు' చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు.. తాజాగా ''9 అవర్స్'' అనే వెబ్ సిరీస్ తో వచ్చారు. క్రిష్ ఈ సిరీస్ కు కథ అందించడమే కాదు.. షో రన్నర్ గా వ్యవహరించారు. ఇది డిస్నీ హాట్‌ స్టార్‌ ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

'9 అవర్స్' కథ విషయానికొస్తే.. 1980స్ లో ముగ్గురు ఖైదీలు జైలు నుండి తప్పించుకొని హైదరాబాద్‌ లో మూడు బ్యాంకు దొంగతనాలు ప్లాన్ చేస్తారు. మొదటి రెండు బ్యాంకులను దోచుకుని పరారైన దొంగలు.. మూడో బ్యాంకులో చిక్కుకొని ఉద్యోగులను బందీలుగా మార్చుకుంటారు. ఈ దోపిడీ కేసును పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ (తారకరత్న) డీల్ చేయడానికి రంగంలోకి దిగుతాడు. పోలీసులు దొంగలను పట్టుకున్నారా లేదా? ఈ దొంగా పోలీస్ ఆటలో చివరికి గెలుపెవరిది? అనేది మిగతా కథ.

మల్లాది వెంకట కృష్ణ రాసిన తొమ్మిది గంటలు నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ స్టోరీని తీర్చిదిద్దారు. నిరంజన్ కౌశిక్ మరియు జాకబ్ వర్గీస్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై - సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇందులో తారకరత్నతో పాటుగా అజయ్ - వినోద్ కుమార్ - మధు షాలినీ - రవి వర్మ - ప్రీతి అస్రానీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

తారకరత్న పోలీసాఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. పరిథి దాటకుండా పాత్రకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ చేశారు. క్రిష్ అతనికి మంచి పాత్ర రాశాడని చెప్పాలి. చాలా గ్యాప్ తర్వాత నందమూరి హీరోకి మంచి పాత్ర దొరికిందని చెప్పాలి. అజయ్ కూడా ఇంటెన్స్ రోల్ తో మెప్పించారు. రవి వర్మ - శ్రీ తేజ్ లు దొంగలుగా తమ నటనతో మెప్పించారు. వినోద్ కుమార్ - మధు షాలినీ - ప్రీతి అస్రానీ కూడా ఆకట్టుకున్నారు.

టైటిల్ కి తగ్గట్టుగా '9 అవర్స్' సిరీస్ ను 9 ఎపిసోడ్స్ గా రూపొందించారు. కానీ ఆ కంటెంట్ ని కాస్త కుదించి మరింత గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పే అవకాశం ఉండదని అనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతాయి. కొన్ని సన్నివేశాలు క్రిష్ ట్రేడ్ మార్క్ గా కనిపిస్తాయి.

క్రిష్ హోమ్ బ్యానర్ స్థాయికి తగ్గట్టుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి. వెబ్ సిరీస్ అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. దర్శకులు జాకబ్ - నిరంజన్ లు కథని బాగా ప్రెజెంట్ చేశారు. కాకపోతే అక్కడక్కడా స్లో నేరేషన్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

శక్తికాంత్ కార్తీక్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 1980స్ తగిన విధంగా సెటప్ అంతా బాగుంది. మొత్తం మీద నటీనటుల పెర్ఫామెన్స్ లు మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పీరియాడిక్ క్రైమ్ డ్రామా రూపొందిన '9 అవర్స్' సిరీస్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
Tags:    

Similar News