అందాల భామ అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న

Update: 2018-10-07 07:41 GMT
మిస్ వరల్డ్‌ బంగ్లాదేశ్‌-2018 పోటీ. ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఈ అందాల పోటీలో చాలామంది సుంద‌రాంగులు పోటీప‌డ్డారు. తొలుత తమ అందాల‌ను ఆర‌బెడుతూ.. హొయ‌లొలికేలా న‌డుస్తూ న్యాయ నిర్ణేత‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఆన‌క జ‌డ్జీలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌దైన శైలిలో సమాధానాలు చెప్పాల్సిన స‌మ‌యం రానే వ‌చ్చింది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు భామ‌లంతా స‌మాధానాలు చెప్తూ.. త‌మ విజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆలోచ‌న‌ల్లోనూ తాము మేటీయేన‌ని రుజువు చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతలోనే ఓ భామ చెప్పిన స‌మాధానం జ‌డ్జీలు స‌హా ప్రేక్ష‌కులంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఔరా.. అంటూ ముక్కున వేలేసుకునేలా చేసింది.

అంద‌మంటే కేవ‌లం శారీర‌క సౌంద‌ర్య‌మే కాదు. మంచి మ‌న‌సుండాలి. విజ్ఞాన‌ముండాలి. మాన‌వాళి స‌మ‌స్య‌లు తెలిసుండాలి. స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారికి చేయూత‌నందించే ధైర్యం ఉండాలి. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా స‌రే అందాల‌ పోటీల్లో పాల్గొనే భామ‌ల‌ అంద‌చందాల‌తోపాటు తెలివితేట‌ల‌ను కూడా న్యాయ నిర్ణేత‌లు ప‌రీక్షిస్తారు. తాజాగా మిస్ వరల్డ్‌ బంగ్లాదేశ్‌-2018 పోటీలోనూ తొలుత శారీర‌క‌ సౌంద‌ర్యాన్ని ప‌రీక్షించి.. ఆపై తుది రౌండ్‌ లో అభ్య‌ర్థుల విజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించారు.

 'H2O అంటే ఏమిటి?' ఇదీ పోటీలో భాగంగా ఓ భామ‌ను న్యాయ నిర్ణేత అడిగిన ప్ర‌శ్న‌. నిజానికి చిన్నారులు సైతం చ‌టుక్కున స‌మాధానం చెప్పేయ‌గ‌ల ప్ర‌శ్న ఇది. నీటి ర‌సాయ‌నిక ఫార్ములాయే H2O. సైన్స్‌ పై క‌నీస అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రైనా ఆ ప్ర‌శ్నకు వెంట‌నే జ‌వాబు చెప్పేయ‌గ‌ల‌రు. కానీ, అందాల పోటీలో ఆ భామ చెప్పిన స‌మాధానం మాత్రం నిర్వాహ‌కులు - న్యాయ నిర్ణేత‌లు - ప్రేక్ష‌కుల‌ను నిశ్చేష్టును చేసింది. ఇంత‌కీ ఆమె ఏమందో తెలుసా.. 'H2o పేరుతో ఢాకాలో రెస్టారెంట్‌ ఉంది కదా..!' అని. భామ స‌మాధానంతో అక్క‌డున్న‌వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆమె అజ్ఞానానికి ప‌డీప‌డీ న‌వ్వుకున్నారు. ఆపై తేరుకున్న న్యాయ నిర్ణేత‌లు.. ఢాకాలోనే కాదు ముంబైలో కూడా మరో రెస్టారెంట్ ఉందంటూ అస‌హ‌నం వ్యక్తం చేశారు. క‌నీస విష‌య ప‌రిజ్ఞానం కూడా లేక‌పోవ‌డంతో ఆమెను పోటీ నుంచి ఎలిమినేట్ చేసేశారు. ఏదేమైనా.. ఆమె చెప్పిన స‌మాధానం మాత్రం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది.
Tags:    

Similar News