పురోహితుడిగా మోహన్ బాబు కొత్త అవతారం

Update: 2020-08-19 17:38 GMT
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచు ఫ్యామిలీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా....విద్యాసంస్థలు, వ్యాపారాలు, సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. విద్యా నికేతన్ ను స్థాపించిన మోహన్ బాబు...ఎందరికో విద్యాదానం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా మోహన్ బాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు హీరోగా, నటుడిగా విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను వెండితెరపై మెప్పించిన ఎంబీ...తాజాగా రాబోయే వినాయక చవితి సందర్భంగా ఓ సరికొత్త అవతారమెత్తబోతున్నారు. రీల్ లైఫ్ లో పురోహితుడి పాత్రలో నటించి మెప్పించిన ఈ విలక్షణ నటుడు....రియల్ లైఫ్ లోనూ పురోహితుడిగా మారబోతున్నారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్బంగా వినాయక చవితి పూజా విధానాన్ని మోహన్ బాబు స్వయంగా చదివి వినిపించబోతున్నారు.

లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది. కనీసం, ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకొని పురోహితుడిని పిలిపించుకొని పూజ చేయించుకోవడానికి కరోనా భయం వెంటాడుతోంది. అదీగాక, ప్రతి ఒక్కరూ పురోహితుడు లేదా పండితుడికి దక్షిణ చెల్లించే స్థోమత ఉండదు. అటువంటి వారంతా వినాయక చవితి వృత విధానం పుస్తకం లేదా వీడియోలపై ఆధారపడుతుంటారు. అటువంటి వారికోసం మోహన్ బాబు పూజారి అవతారమెత్తబోతున్నారు. వినాయక చవితి పూజా విధానం వీడియోకు మోహన్ బాబు తన గాత్రాన్ని జోడించబోతున్నారు. తన వాగ్దాటితో అతి కష్టమైన డైలాగ్ లను సైతం అవలీలగా చెప్పగలిగిన మోహన్ బాబు....తన గొంతుతో ఆధ్యాత్మికతను జోడించి వినాయక చవితి పూజా విధాన వీడియోను రూపొందించబోతున్నారు. వినాయక చవితికి ముందు రోజైన ఆగస్టు 21న ఈ వీడియోను విడుదల చేయబోతున్నారు.
Tags:    

Similar News