మోహన్ బాబును దాసరి తన్నిన వేళ..

Update: 2017-06-04 06:22 GMT
దాసరి నారాయణరావు.. మంచు మోహన్ బాబుల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా మోహన్ బాబుకు తొలి అవకాశం ఇచ్చింది దాసరే. భక్తవత్సలం నాయుడుగా ఉన్న అతడి పేరును మోహన్ బాబుగా మార్చిందీ దాసరే. తొలి అవకాశం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత కూడా తన సినిమాల్లో మంచి మంచి పాత్రలిచ్చి మోహన్ బాబు ఎదుగుదలకు కారణమయ్యారు దాసరి. అందుకే ఆయన మీద అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తాడు మోహన్ బాబు. మొన్న దాసరి చనిపోయినపుడు మోహన్ బాబు ఎంత విలవిలలాడిపోయారో అందరూ చూశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి గురించి మాట్లాడుతూ చాలా ఉద్వేగానికి గురయ్యారు మోహన్ బాబు. ఈ సందర్భంగా దాసరితో తన పరిచయం.. ఆయనతో సినిమాలు చేసినప్పటి తన అనుభవాల గురించి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

‘‘దాసరి గారి సినిమాలో అవకాశం ఇస్తారని ఆయన్ని కలవడానికి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి దగ్గర ఎదురు చూసేవాడిని. ఆయన భార్య పద్మగారు నన్ను చూసి ఏంటయ్యా.. ఈ టైమ్‌ లో వచ్చావు.. కూర్చోమనేవారు. ఆయనేమో ఏదైనా ఉంటే నేనే పిలుస్తా అనేవారు. అలా ఓ రోజు మేకప్‌ టెస్టుకి రమ్మన్నారు. నాతో పాటు ఓ పది మంది వచ్చారు. మా అందరికీ మేకప్‌ చేసి.. డైలాగ్‌ చెప్పించారు. అందరి రషెస్ పరిశీలించి ఒకరిని సెలక్ట్ చేయాలి. ఐతే నా రషెస్‌ ఎవరో దాచేశారు. కానీ మా గురువు గారు నా గురించి చెప్పి మరీ రషెస్ బయటికి తీయించారు. ఆయన చేయబోయే సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒక రోల్ ఇచ్చారు. అప్పుడే నాకు ‘మోహన్‌ బాబు’ అనే పేరు కూడా పెట్టారు. ఐతే నటన నేర్పించే విషయంలో ఆయన చాలా కఠినంగా ఉండేవారు. ఒక సినిమాకి లెంగ్తీ డైలాగ్‌ ఇచ్చారు. నేను టేక్స్ మీద టేక్స్‌ తిన్నాను. ఫిల్మ్‌ అయిపోతోంది. కోపం వచ్చి కాలితో గట్టిగా తన్నారు. ‘అబ్బా’ అంటూ రూంలోకి వెళ్లిపోయాను. ఇలా తన్నడం ఏంటని.. నేను వెళ్లిపోతానని మేకప్ మ్యాన్ తో అన్నాను. నువ్వెళ్లిపోతే సినిమా ఏమైనా ఆగిపోతుందా అన్నాడు నిర్మాత. నేను మేకప్‌ వేసుకుని సెట్లోకి వెళ్తే.. ‘ఏంటయ్యా.. ఎక్కడికెళ్తావ్’ అంటూ గురువుగారు ఆటపట్టించారు’’ అని మోహన్ బాబు వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News