సౌత్ లో సినిమాలకు.. రాజకీయాలకు విడదీయరాని బంధం. తమిళనాట అది చాలాచాలా ఎక్కువ. ఎం.జి.రామచంద్రన్ టైం నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. కోట్లాది మంది అభిమానులకు నటుడిగానే కాదు.. నాయకుడిగానూ ఆరాధ్య దైవమయ్యాడు. ఎంజీఆర్ జీవిత గాథతో దర్శకుడు మణిరత్నం రెండు దశాబ్దాల క్రితం ఓ సినిమా తీశారు. అదే ఇరువర్. ఇది ఎంజీఆర్ జీవిత గాథ అని అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా మాత్రమే తెరకెక్కించామని ప్రకటించారు. తెలుగులో ఈ సినిమా ఇద్దరు పేరిట డబ్ అయింది.
తమిళ రాజకీయాల్లో బద్ధ శత్రువులైన ఎంజీఆర్ - కరుణానిధి ఒకప్పుడు మంచి మిత్రులు. ఎంజీఆర్ నటుడిగా.. కరుణానిధి రచయితగా నిలదొక్కుకునే రోజుల్లో వాళ్లిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఇద్దరు సినిమాలో ఎంజీఆర్ ను పోలిన పాత్రను మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. కరుణానిధిని పోలిన పాత్రను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషించారు. ఓ కళాఖండం తరహాలో మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో రెండు ప్రధాన పాత్రలకు మోహన్ లాల్ - ప్రకాష్ రాజ్ జీవం పోశారు. ఇరువర్ చిత్రానికి ప్రకాష్ రాజ్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. విచిత్రమేమంటే ఆ తర్వాత ఏ సినిమాలోనూ వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఇద్దరు వచ్చిన 20 ఏళ్లకు వీళ్లిద్దరూ వెండితెరపై కలిసి కనిపించబోతున్నారు. మళయాళ డైరెక్టర్ వి.ఎ.శ్రీకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఒడియన్ సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత పాత మిత్రుడితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రకాష్ రాజ్ అంటున్నారు. కేరళలోని ఓ జానపద గాధ ఆధారంగా ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఒడియన్ తెరకెక్కుతోంది. మోహన్ లాల్ - ప్రకాష్ రాజ్ తొలిసారి కలిసి నటించిన ఇద్దరు సినిమా ఓ గొప్ప చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న ఒడియన్ మరి ఏ స్థాయిలో ఉంటుందో..