600 కోట్లతో మోహన్ లాల్ సినిమా?

Update: 2017-01-10 08:56 GMT
బాహుబలి సినిమాకు రూ.250 కోట్ల బడ్జెట్ అంటే ఔరా అనుకున్నాం. ఈ బడ్జెట్లో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా అని సందేహించారంతా. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’ మాత్రమే రూ.600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు శంకర్ ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ సినిమాను రూ.400 కోట్ల బడ్జెట్‌తో మొదలుపెట్టాడు. దీని గురించి ఆశ్చర్యపోతుంటే తమిళ సీనియర్ డైరెక్టర్ సుందర్ ఇంత కంటే ఎక్కువ బడ్జెట్లో సినిమా తీయబోతున్నట్లు వెల్లడించాడు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ రూ.340 కోట్ల బడ్జెట్‌ తో ‘న్యూక్లియర్’ సినిమాను అనౌన్స్ చేశాడు. మొత్తానికి వందల కోట్ల బడ్జెట్లో ఇండియన్ సినిమాలు తీయడం మున్ముందు కామన్ అయిపోయేలా ఉంది.

ఐతే పైన పేర్కొన్న సినిమాలన్నీ ఒకెత్తయితే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేయబోతున్న సినిమా ఇంకో ఎత్తు అంటున్నారు. ఆయన ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్లో ఓ సినిమా చేయబోతున్నాడట. ఎం.టి.వాసుదేవ నాయర్‌ రచించిన ‘రాండమ్‌ ఓజ్‌హమ్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందట. మహాభారతంలో భీముని దృక్కోణంలో సాగే కథ అది. ఈ చిత్రాన్ని భారీ హంగుల మధ్య రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు మలయాళ పరిశ్రమ నుంచి వినిపిస్తున్న వార్త కలకలం రేపుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతున్నట్టు సమాచారం. మలయాళం సినిమా మార్కెట్ పరిధి చాలా తక్కువ. అక్కడ రూ.50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసినా ఔరా అనుకుంటారు. అలాంటిది రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే నమ్మశక్యంగా లేదు. ఐతే ఈ చిత్రంలో వేరే పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా నటిస్తారని.. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేస్తారని.. అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని.. కాబట్టి ఈ బడ్జెట్ వయబులే అని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News