టాలీవుడ్ తారలను తీసుకెళ్లిపోతున్నాడు

Update: 2017-02-13 05:53 GMT
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను టాలీవుడ్ బాగానే ఆదరించింది. మనమంతా చిత్రంలో లీడ్ రోల్ చేయించడం.. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ హీరో అయినా సినిమాను నడిపించే కేరక్టర్ చేయడంతో.. ఇక్కడ కూడా మోహన్ లాల్ కు మార్కెట్ వచ్చేసింది. వరుసగా ఆయన సినిమాలు డబ్ అయిపోతున్నాయి. మంచి వసూళ్లు కూడా రాబట్టేస్తున్నాయి.

మరి టాలీవుడ్ కి రుణం తీర్చుకుంటున్నాడో.. లేక టాలీవుడ్ లో ట్యాలెంట్ ని గుర్తించాడో చెప్పలేం కానీ.. వరుసగా ఇక్కడి తారలను అక్కడ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాడు. మొదటగా జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ ను కేరళ ప్రజలకు పరిచయం చేసిన మోహన్ లాల్.. ఆ తర్వాత మెగా హీరో అల్లు శిరీష్ ను కూడా తీసుకెళ్లాడు. 1971: బెయాండ్ బోర్డర్స్ అనే మూవీలో వార్ ట్యాంకర్ ఆపరేటర్ గా కీలకపాత్రనే చేస్తున్నాడు శిరీష్. ఇప్పుడు మరో ఇద్దరు తెలుగు తారలను కూడా మల్లూవుడ్ కు పట్టుకెళుతున్నాడు మోహన్ లాల్.

రిటైర్డ్ కాప్ గా బి.ఉన్నికృష్ణన్ సినిమాలో.. ఓ హీరోయిన్ గా రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నారు. ఇది ఆమెకు మలయాళ పరిశ్రమలోకి అరంగేట్ర సినిమా కానుంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ కు కూడా ఇదే మొదటి మలయాళీ చిత్రం. వరుసగా టాలీవుడ్ తారలను తీసుకెళ్లి మలయాళ ఇండస్ట్రీకి పరిచయం చేసేస్తున్నాడు మోహన్ లాల్. తన సినిమాలకు తెలుగులో మార్కెట్ పెంచుకోవడంలో వ్యూహమే ఇదంతా అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News