వీడియో: పండోరా మాయా ప్ర‌పంచంలోకి..!

Update: 2022-12-08 13:34 GMT
జేమ్స్ కామెరాన్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో థియేటర్లలోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోను అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ఈ సీక్వెల్ సినిమా 2022 కి ఘ‌న‌మైన ముగింపును అందిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. గొప్ప అనుభ‌వాలు అనుభూతుల‌ను చివ‌రాఖ‌రులో మిగిల్చే భారీత‌నం నిండిన చిత్ర‌మిది.

ఈ చిత్రం అధికారికంగా విడుదల కావడానికి కేవలం తొమ్మిది రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇంత‌లోనే ఫిలిం మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు మేకింగ్ వీడియోలు స‌హా ర‌క‌ర‌కాల ఆక‌ర్ష‌ణీయ‌మైన అంశాల‌తో ప్ర‌మోట్ చేస్తున్నారు. మా 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ఫ‌లించ‌బోతోంది.

ఇప్పుడు 'ది వే ఆఫ్ వాటర్ కొత్త ఫీచర్' పేరుతో పండోర మాయా ప్రపంచంలోకి ప్ర‌యాణించండి అంటూ ఒక కొత్త వీడియోని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఈ వీడియో అత్యంత వేగంగా ఆన్ లైన్ లో దూసుకుపోతోంది.

''నేను స్టూడియోకి వెళ్లి ఇంకో సినిమా చేద్దాం అని చెప్పాను.. బార్డ‌ర్స్ దాటి ఈసారి ఒక ఊపు ఊపేద్దా''మ‌ని చెప్పానంటూ కామెరూన్ సీక్వెల్ గురించి చెప్పాడు. సీక్వెల్ కథాంశం చాలావరకు  కొత్త త‌ర‌హా వన్యప్రాణులు.. పర్యావరణాలు.. సంస్కృతులకు సంబంధించి పండోరపై భారీ విన్యాషాల షో ఇద‌ని ప్రోమోలు ట్రైల‌ర్ వెల్ల‌డించాయి. తాజా వీడియోలో ఫ్రాంచైజీ అసాధారణ పునరాగమనాన్ని కొత్త ఫీచర్ ఆవిష్క‌రించింది.

ఈ వీడియోలో నిజానికి సంభాష‌ణా చాతుర్యం ఎంతో ఆక‌ట్టుకుంటోంది. ''ప్రపంచం పెద్దది. వాటాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని ఆశ్చర్యంగా చూసేవాడు'' అని చిత్రంలో నెయిటిరి పాత్రలో నటించిన జో సల్దానా అన్నారు. ఇది మొదటి సినిమా అనుభవం...., కానీ స్టెరాయిడ్స్ మీద అని కూడా హింట్ ఇచ్చారు. సరికొత్త ఫీచర్ లో తుల్ కున్ అని పిలుచుకునే తిమింగలం లాంటి జీవిని కూడా ప్రదర్శించారు. కల్నల్ మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) తన రీకాంబినెంట్ పాత్రను పునరావృతం చేశారు.

అవతార్ (2009)కి సీక్వెల్ ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా స‌రికొత్త రికార్డుల‌ను ఆవిష్క‌రించ‌బోతోంది. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' భారతదేశంలోని థియేటర్లలో డిసెంబర్ 16 నుండి ఇంగ్లీష్- హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ భాషల్లో విడుదలవుతోంది. సామ్ వర్తింగ్టన్- జో సల్దానా- సిగౌర్నీ వీవర్- స్టీఫెన్ లాంగ్ -కేట్ విన్స్‌లెట్ వంటి అగ్ర తార‌ల పేర్లు ఈ మూవీతో ముడిప‌డి ఉన్నాయి. ఈ చిత్రం స‌రికొత్త బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పుతుందని జేమ్స్ కామెరూన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

మార్వ‌ల్ రికార్డుల‌న్నీ బ్రేక్:

అవతార్ 2 అడ్వాన్స్ బుకింగ్: ది వే ఆఫ్ వాటర్ రికార్డులను బద్దలు కొట్టింది. మార్వెల్ సినిమాల అన్ని రికార్డుల‌ను ఇది అధిగమించింది అవతార్ 2 అడ్వాన్స్ బుకింగ్ ల్లో కుమ్మేస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. 2022లోనే అతిపెద్ద ఓపెన‌ర్ గా నిల‌వ‌నుంది.

విడుదలకు ముందే ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైన టాప్ గ్రాస‌ర్ ల‌ను అధిగ‌మించి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా అడ్వాన్స్ బుకింగ్ ల‌తో సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. ఇప్పటికే భార‌త‌దేశంలో ప్రీబుకింగుల‌తో రూ. 10 కోట్ల నికర వసూళ్ల‌ను సాధించింది.

బాక్సాఫీస్ ఇండియా నివేదికల ప్ర‌కారం... విడుదలకు 10 రోజుల ముందు దేశంలో ఈ సంఖ్యలను సాధించడం నిజంగా ఒక ఘనత. మునుముందు ఈ సంఖ్య మ‌రింత‌గా పెరుగుతుందని భావిస్తున్నారు. తమిళం- మలయాళం - కన్నడ సహా పలు భారతీయ భాషలలో విడుదలవుతున్నందున సెంట్రల్ మార్కెట్ లోనే కాకుండా భారతదేశంలోని దక్షిణాది మార్కెట్ లలో కూడా భారీ హైప్ తో వ‌స్తోంది.

ఇటీవల కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలు థియేట్రిక‌ల్ గా భారతదేశంలోను అలాగే అంతర్జాతీయ బాక్సాఫీస్ ను శాసించాయి. అయితే ఈ అద్భుతమైన సంఖ్యలను ఇప్ప‌టికే 9-రోజుల ప్రీ-బుకింగ్ ల‌తోనే అవ‌తార్ 2 అధిగ‌మించింది. ముఖ్యంగా మార్వ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'డాక్ట‌ర్ స్ట్రేంజ్'  అలాగే 'మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్' రికార్డుల‌ను అవ‌తార్ 2 అధిగమించింది. బాక్స్ ఆఫీస్ ఇండియా క‌థ‌నం ప్రకారం.. ప్రీ-బుకింగ్ సేల్స్ ఇలానే కొనసాగితే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' వ‌సూళ్లు  ఎవెంజర్స్ - ఎండ్‌గేమ్ రికార్డుల‌ను కూడా బ్రేక్ చేసి సౌత్ మార్కెట్ లో చరిత్ర సృష్టించవచ్చని భావిస్తున్నారు. నాన్-సౌత్ ఫిల్మ్ రిలీజ్ కోసం మొదటి రోజు థియేట్రిక‌ల్ గా అత్యధిక సంఖ్యలతో రికార్డుల‌ను బ్రేక్ చేయ‌నుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News