‘మా’ పంచాయితీ: హాట్ హాట్ పరిణామాలు

Update: 2021-08-15 02:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా'లో లొల్లి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సినిమాను మించి ట్విస్ట్ లతో, గొడవలతో సినీ సెలబ్రెటీలు రచ్చ చేసేస్తున్నారు. మైక్ కనిపిస్తే చాలు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

దీంతో 'మా'లో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్-మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. మరో నలుగురిలో హేమ, జీవిత, సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు.  ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను కూడా ప్రకటించారు. ఇక నరేశ్ వర్గంలోని 100 ఓట్లు కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి.  ఎవరు గెలిచినా 2021-24 సీజన్ కు అధ్యక్షుడిగా 'మా'ను ఏలుతారు.

ఇన్నాళ్లు ఏకగ్రీవం అంటూ వినిపించినా.. దానికంటే ఎన్నికలే బెటర్ అని ఉద్దేశంలో సినీ పెద్దలు ఉన్నారు. చిరంజీవి కూడా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరిన సంగతి తెలిసిందే.

ఎన్నికల పోరులో ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు. నటి హేమ ఇప్పటికే అధ్యక్షుడు నరేశ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. 'మా'లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆమె ఆరోపించడంతో రచ్చ మొదలైంది. హేమపై సీనియర్ నరేశ్ ఇప్పటికే సీరియస్ అయ్యారు. ఆమెపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.

నరేశ్ తోపాటు జీవిత రాజశేఖర్ కూడా హేమపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మాలో నిబంధనలు ఉల్లంఘించిన కొందరు 'మా' సభ్యులపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు ఫిర్యాదు చేశారు సభ్యులు. దాదాపు 100కు పైగా సభ్యుల సంతకాలతో ఫిర్యాదును సిద్ధం చేశారు. అయితే నాలుగు రోజుల క్రితమే కృష్ణంరాజుకు మెగా స్టార్ చిరంజీవి లేఖ రాసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈక్రమంలోనే ఈనెల 22న మా జనరల్ బాడీ మీటింగ్ లో మా ఎలక్షన్ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News