మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` ఎన్నిక‌లు ఎపుడు?

Update: 2021-03-20 07:30 GMT
టాలీవుడ్ లో అత్యంత కీల‌కమైన‌ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో వివాదాల గురించి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో మాజీ అధ్య‌క్షుడు శివాజీరాజా.. పోటీదారు అయిన‌ సీనియ‌ర్ న‌రేష్ మ‌ధ్య వివాదంపైనా.. వాడి వేడి చ‌ర్చ సాగింది. 2019-21 సీజ‌న్ లో శివాజీరాజాపై నెగ్గి సీనియ‌ర్ న‌రేష్ అధ్య‌క్ష ప‌ద‌విని చేజిక్కించుకున్నారు. శివాజీ రాజా సార‌థ్యంలో అవినీతిని ప్ర‌శ్నించి ఆయ‌న ఎన్నిక‌ల్లో నెగ్గారు. సీనియ‌ర్ న‌రేష్ కి మెగాస్టార్ చిరంజీవి - నాగ‌బాబు వ‌ర్గాలు అప్ప‌టి ఎల‌క్ష‌న్ లో స‌హ‌కారం అందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే ఆయ‌న అధ్యక్షుడు అయ్యాక కూడా వివాదాలు అలానే కొన‌సాగాయి. అధ్య‌క్షుడిగా ఎన్నికై ఏర్పాటు చేసిన తొలి మీటింగులోనే గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్కాయి. చాలామంది క‌మిటీ స‌భ్యులు న‌రేష్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆయ‌న‌ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నార‌ని ఈసీ వ‌ర్గాల్ని పిల‌వ‌డం లేద‌ని ఆరోపించారు. ఉపాధ్య‌క్షులు స‌హా ఈసీ స‌భ్యుల్లోనూ భిన్న‌మైన అభిప్రాయాలేర్ప‌డ్డాయి. అయితే మ‌ధ్య‌లో సినీ పెద్ద‌లు ఆ గొడ‌వ‌ల్ని స‌ద్ధుమ‌ణిగేలా చేసినా కానీ తిరిగి మ‌ళ్లీ మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక మా క‌మిటీ నుంచి వైదొల‌గిన సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో ఎంత వేడెక్కించిందో తెలిసిన‌దే. ``మంచిని గ‌ట్టిగా విన‌ప‌డేలా చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలి!`` అంటూ మెగాస్టార్ చిరంజీవీ క్లాస్ తీస్కునేంత వ‌ర‌కూ వెళ్లింది.

అందుకే ఈసారి మా ఎన్నిక‌ల్లో ఇలాంటివి లేకుండా సినీపెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోనున్నారు? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది. రెండేళ్ల పాల‌నా కాలం పూర్త‌యింది. 2021-23 సీజ‌న్ కి మా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉండ‌గా సినీపెద్ద‌ల నిర్ణ‌యం కోసం ఆర్టిస్టులు వేచి చూస్తున్నార‌ని తెలిసింది. సుమారు 800 పైగా ఆర్టిస్టులు ఉన్న మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు మ‌రోసారి ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నాఆ. అయితే ఈసారి ఎన్నిక‌లు ఎప్పుడు? అన్న‌దానిపై `మా` వ‌ర్గాలు ఏం చెబుతాయో చూడాలి.
Tags:    

Similar News