ప్ర‌భుత్వ పోర్ట‌ల్లోనే టిక్కెట్.. ఆమోదించిన AP క్యాబినెట్!

Update: 2021-10-28 14:41 GMT
ఇక‌పై ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లోనే ప్రేక్ష‌కులు టిక్కెట్లు కొని సినిమా థియేట‌ర్ కి వెళ్లాలి. ధ‌ర‌ల‌ప‌ర‌మైన టెన్ష‌న్ ఇక ఉండ‌దు. అలాగే బ్లాక్ మార్కెటింగ్ ని పూర్తిగా బంద్ చేయ‌నున్నారు. ఆ మేర‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై అనేక కీలక నిర్ణయాల గురించి చర్చించింది. ఆంధ్ర ప్రభుత్వంచే నిర్వహించబడే కొత్త సినిమా టికెటింగ్ పోర్టల్ పై క్లారిటీ వ‌చ్చేసింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలో పోర్టల్ అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విక్రయాల గురించిన కొత్త మార్గదర్శకాలతో పాటు కొత్త టిక్కెట్ ధర జీవో అతి త్వరలో విడుదల కానున్నాయి. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఆమోద‌యోగ్యమేనా కాదా? అన్న‌దానిపై ఏపీ మంత్రి పేర్ని నాని సినీపెద్ద‌ల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో టిక్కెట్ల పోర్టల్ గురించి ఆయ‌న అభిప్రాయాన్ని సేకరించారు. దీనికి నిర్మాత‌ల నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది.

ఇక‌పోతే కేబినెట్ లో సినిమా టిక్కెట్లకు సంబంధించిన కొత్త టిక్కెట్టు ధ‌ర ప‌రిశీల‌న‌కు ఆమోదం ల‌భించ‌డం నిర్మాత‌ల‌కు ఊర‌ట‌. మ‌రోవైపు కింగ్ నాగార్జున- నిర్మాతలు నిరంజన్ రెడ్డి- ప్రీతమ్ రెడ్డిలతో కలిసి వైఎస్ జగన్ ను ఆయన తాడేపల్లి నివాసంలో లంచ్ మీటింగ్ కోసం కలిశారు. వైఎస్ జగన్ తన కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత నాగ్ తో భేటీ అయ్యారు. నాగార్జున వైఎస్‌ జగన్ ను కలవడానికి గల అసలు కారణం ఏమిటి? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News